logo

దారి మళ్లించి దోపిడీ

సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయం. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన డోలా శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్‌లో దిగారు. ఆర్టీసీ

Published : 29 Jun 2022 02:38 IST

ఆటోడ్రైవర్ల ముసుగులో అరాచకం

 వెంటాడి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు 

బాధితుడు డోలా శ్రీనివాసరావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయం. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన డోలా శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్‌లో దిగారు. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులున్నారు. ఆటో కలెక్టర్‌ బంగళా మీదుగా ట్రంకురోడ్డులోకి వచ్చింది. అటు నుంచి పాత మార్కెట్‌ వైపు వెళ్లాల్సి ఉండగా.. దక్షిణ బైపాస్‌ వైపు డ్రైవర్‌ దారి మళ్లించాడు. విషయాన్ని గుర్తించిన నరసింహారావు అదేంటని అతన్ని ప్రశ్నించారు. మిగిలిన ఇద్దరినీ బైపాస్‌లో దించేసి బస్టాండ్‌కు వెళ్దామని నమ్మబలికాడు. అందుకు అతను ససేమిరా అనడంతో అప్పటికే అందులో ఉన్న యువకులు అతన్ని కత్తితో బెదిరించి బలవంతంగా కూర్చోబెట్టారు. ఆటోను టంగుటూరు వైపు తీసుకెళ్లారు. సంఘమిత్ర దాటిన తర్వాత శ్రీనివాసరావుపై దాడి చేసి రూ.7,500 నగదు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అనంతరం అతన్ని దించకుండానే వెళ్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు సూరారెడ్డిపాలెం ఫ్లైఓవర్‌ సమీపంలో ఆటోలో నుంచి రోడ్డు మీదకి దూకేశారు. సమీపంలో ఉన్న హైవే మొబైల్‌ పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను వెంబడించారు. తూర్పు నాయుడుపాలెం వద్ద ఫ్లైఓవర్‌ కింద నుంచి వెళ్లి ఆటోకు అడ్డుగా తమ వాహనాన్ని నిలిపారు. ఈ ఉదంతంతో నిందితులు పోలీసు వాహనానికి ఆటోను కాస్త దూరంలో నిలిపి పరారయ్యారు. ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని టంగుటూరు స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఆటో ఆధారంగా నిందితులు ఒంగోలు అరవ కాలనీకి చెందిన యువకులుగా గుర్తించారు. వారిలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని