logo

6,066 దరఖాస్తులు.. 368 అభ్యంతరాలు

ఉపాధ్యాయ బదిలీల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

Updated : 01 Jun 2023 05:58 IST

 ఉపాధ్యాయ బదిలీలపై కసరత్తు

నేడు తుది జాబితా, ఖాళీల ఖరారు

    

దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్న విద్యాశాఖ ఐటీ విభాగం సిబ్బంది

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి ప్రకాశంలో మొత్తం 6,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 368 మంది తమ అభ్యంతరాలను తెలుపుతూ అర్జీలు అందించారు. పరిశీలనలో భాగంగా తొలిరోజు 170 వాటిల్లోని లోపాలు సవరించారు. గురువారం మిగిలినవి పరిష్కరిస్తారు. ఆరు రకాల అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా దంపతులుగా ఉంటే స్పౌజ్‌ ప్రాధాన్యతను వినియోగించుకునే అంశంపై, క్రమబద్ధీకరణ పాయింట్ల నమోదులో తేడాలు, దీర్ఘకాలిక జబ్బులుండి ప్రాధాన్యత కోరుకునేవారు, దివ్యాంగుల విభాగంలో కొన్ని సవరణలను ఉపాధ్యాయులు కోరారు. సహేతుకమైన వాటిని ఆమోదించారు. బదిలీ దరఖాస్తుల్లో త్రిపురాంతకం మండలం నుంచి అత్యధికంగా 184 మంది, పర్చూరు మండలం నుంచి అత్యల్పంగా 39 మంది దరఖాస్తు చేశారు. గురువారం బదిలీల తుది జాబితా, ఖాళీలను ఖరారు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

* మాకొద్దు బాబోయ్‌ ఉద్యోగోన్నతులు...: విద్యాశాఖలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగోన్నతులను పలువురు మాకొద్దంటే వద్దంటున్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాక అందుకు అనుగుణంగా బోధనకు సిద్ధం కావాల్సి రావడం... వయసు పైబడిన తర్వాత కొందరు ఆ బాధ్యతను కష్టంగా భావిస్తుండటం.. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టు బోధన చేయాల్సి రావడం.. కొందరు వారికొచ్చే పాయింట్లకు దూరప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుందని భావిస్తుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. 24 సంవత్సరాల సర్వీసు నిండిన ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనం స్వల్పం కావడం కూడా ఒక కారణం. పోస్టు కోరుకున్నచోట పిల్లల సంఖ్య తక్కువుగా ఉంటే భవిష్యత్తులో మళ్లీ బదిలీ కావాల్సి వస్తుందనే భయమూ కొందరిలో ఉంది. సబ్జెక్టుల వారీగా 642 మందికి ఉద్యోగోన్నతులు కల్పించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేయగా.. నాలుగు సబ్జెక్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు తగినంత మంది ముందుకు రాలేదు. గణితం, సాంఘికశాస్త్రం, ఆంగ్లం, జీవశాస్త్రం సబ్జెక్టులకు మొత్తం 200 మంది అవసరం అవగా.. 120 మంది మాత్రమే ఉద్యోగోన్నతికి ఆమోదం తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని