logo

మాజీ మంత్రి మాటల మర్మమేమిటి..! జగన్‌ ఓడిపోతారని పరోక్ష జోస్యమా

 జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆయన శనివారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Updated : 10 Dec 2023 13:44 IST

తమపై సీఎంకి ప్రేమ లేదని ఒప్పుకోలా
రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన బాలినేని వ్యాఖ్యలు

జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆయన శనివారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సీనియర్‌ నేత అసలింతకీ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది పలువురికి అంతుచిక్కకుంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆయనపై పలు ఊహాగానాలు వచ్చాయి. తెదేపా, జనసేనతో కలిసి నడుస్తారని, వైకాపాను వీడబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేశాయి. వైకాపా నుంచి పోటీ చేసినా ఒంగోలును వీడి పశ్చిమ ప్రాంతానికి వెళ్తారంటూ కూడా వచ్చాయి. వీటన్నింటినీ బాలినేని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వచ్చారు. తాజా వ్యాఖ్యల్లోనూ తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని, కాకపోతే నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలవకపోతే బరిలో నిలవననీ, ప్రస్తుత రాజకీయాలంటే తనకు, తన కుటుంబానికీ వెగటు పుడుతోందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అసలు పార్టీలో అంతర్లీనంగా ఏం జరుగుతోంది. వైకాపా అధిష్ఠానంతో బాలినేని సఖ్యత చెడిందా.. జగన్‌పై మాకు అపారమైన ప్రేమ ఉన్నా.. మాపైన ఆయనకు ఉండొద్దా.. అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చా సాగుతోంది.

న్యూస్‌టుడే,  ఒంగోలు నేరవిభాగం

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వస్తుందని ఊహించా.. రూ.50 లక్షలు పందెం కూడా కాశా. అక్కడ బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఇక్కడ వైకాపా గెలుస్తుందనే భావనలో ఉన్న మా అబ్బాయి చెప్పాడని డబ్బు వచ్చే అవకాశం ఉన్నా పందెం నుంచి ఆ తర్వాత తప్పుకొన్నా. మాకు జగన్‌ అంటే అంత ప్రేమ. ఆయనకు కూడా ఉండాలిగా, ఉండాలనే కోరుకుంటున్నా..

ఎమ్మెల్యే, మంత్రిగా బాలినేని మూడు దశాబ్దాలపాటు పలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఫలితాలపై ఆయనకు ముందుగానే కొంత అవగాహన ఉండొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే రాష్ట్రంలో వైకాపా గెలుస్తుందని తన తనయుడు ప్రణీత్‌ రెడ్డి చెప్పారని.. డబ్బులు వస్తాయని తెలిసి కూడా తాను కాంగ్రెస్‌ గెలుపుపై కాసిన రూ.50 లక్షల పందేన్ని వెనక్కు తీసుకున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్రంలో జగన్‌ గెలవాలని తన కుమారుడు కోరుకుంటున్నాడని, తనకి జగన్‌ అంటే అంతపిచ్చి అని చెప్పారు. అంటే అక్కడ కాంగ్రెస్‌ గెలుపులో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ జగన్‌ ఓడిపోతారనేది బాలినేని జోస్యమా అనే చర్చ సాగుతోంది. ‘మాకు ఆయనపై అంత అభిమానం ఉంది. మాపైన ఆయనకు ఉండొద్దా..? ఉండాలని కోరుకుంటున్నా’.. అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయి.


నా కుమారుడి(ప్రణీత్‌రెడ్డి)ని రాజకీయాల్లోకి తీసుకురావాలా.. వద్దా.! అని ఆలోచిస్తున్నా. మన పార్టీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు కనీసం ఓటర్ల జాబితాలు కూడా పరిశీలించటం లేదు. మీరందరూ కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తానంటేనే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా.  అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. నాకు పోయేదేమీలేదు’.

వేరు కుపంట్లతోనే వెగటా..: ‘నాకే కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా రాజకీయాలంటే వెగటు పుడుతోంది. నా కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలా..? వద్దా..? అనే ఆలోచనలో ఉన్నాను’ అంటూ బాలినేని (Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యల పైనా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి పాత్ర జిల్లాలో పలు సందర్భాల్లో వినిపించింది. తమిళనాడులో పట్టుబడిన రూ.అయిదు కోట్ల నగదు నుంచి పలు భూ వివాదాలు, ప్రైవేట్‌ సెటిల్‌మెంట్లలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో సహజంగానే విపక్షం ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. సొంత పార్టీలో కూడా బాలినేని, ఆయన తనయుడిపై అధిష్ఠానానికి కొందరు ఫిర్యాదులు చేశారు. విలేకరుల సమావేశంలో తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర చేస్తున్నారని, సొంత పార్టీలోని నాయకులు, తాను టిక్కెట్లు ఇప్పించిన వ్యక్తులే తనపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారంటూ బాలినేని భావోద్వేగానికి గురై కంట నీరు కూడా పెట్టుకున్నారు. తాజాగా మరోసారి తన తనయుడి రాజకీయ రంగప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు తావిచ్చాయి.


అయిదుసార్లు ఎమ్మెల్యేని, రెండుసార్లు మంత్రిగా చేశా. ఒంగోలు ఎమ్మెల్యేగా ఎక్కడా రూపాయి తీసుకోలేదు. ఇక్కడ నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు. అలాగని నేను నీతిమంతుడ్ని అని చెప్పను. మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం డబ్బులు తీసుకున్నా. నాకూ  ఖర్చులుంటాయి కదా’..

శ్రేణులు సహకరించడం లేదా...: ‘రానున్న ఎన్నికల్లో ఒక సామాజిక వర్గం ఒంగోలులో నేరుగా రోడ్డు మీదకు వస్తుంది. దీటుగా ఎదుర్కోవాలంటే మీరంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఎన్నిసార్లు చెప్పినా కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు ఓటర్ల జాబితాలను కూడా పరిశీలించటం లేదు. మీరు నాకు అండగా నిలిస్తేనే నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేదంటే తప్పుకొంటా’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైకాపా శ్రేణుల్లో తీవ్ర దుమారాన్నే  రేపుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని