logo

Balineni: నా కుమారుడికిస్తే నెత్తికెత్తుకుంటా

ఒంగోలు ఎంపీ స్థానంపై అధికార పార్టీ వైకాపా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థిగా రోజుకో పేరును తెర పైకి తెస్తూ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తోంది. తమ పార్టీలోని పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలే గందరగోళానికి గురయ్యేలా చేస్తోంది

Updated : 30 Jan 2024 09:03 IST

ఎంపీ స్థానంపై బాలినేని ప్రతిపాదన
విజయసాయిరెడ్డితో మాజీ మంత్రి చర్చ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు ఎంపీ స్థానంపై అధికార పార్టీ వైకాపా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థిగా రోజుకో పేరును తెర పైకి తెస్తూ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తోంది. తమ పార్టీలోని పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలే గందరగోళానికి గురయ్యేలా చేస్తోంది. జిల్లాలో సరైన అభ్యర్థులే లేరని భావించిన అధిష్ఠానం తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి ఆర్‌.కె.రోజా పేర్లను ఇటీవల ప్రతిపాదించింది. వీరు స్థానికేతరులు కావడంతో నెగ్గుకురాలేరంటూ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరో కొత్త చర్చకు తెర లేపారు. సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అవసరం లేదని భావిస్తే ఆ స్థానంలో తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి పేరును పరిశీలించాలని పార్టీ పెద్దల ఎదుట నూతన ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం.

సీఎంవోకు వెళ్లి.. మళ్లీ సాయిరెడ్డి వద్దకు...

బాలినేని సోమవారం ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో పర్యటించారు. అనంతరం తన తనయుడు ప్రణీత్‌రెడ్డి, మరికొందరు ముఖ్య అనుచరులతో కలిసి తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఉండగా.. కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సీఎం ఇతర పనుల్లో ఉండటంతో కలవడం సాధ్యపడలేదు. దీంతో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటను అంగీకరించకపోతే స్థానికేతరులు ఎవరు పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని బాలినేని సూచించినట్లు సమాచారం. సదరు స్థానం నుంచి తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి అవకాశం కల్పించాలని కోరారని.. అలా అయితే పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను తాను నెత్తికెత్తుకుంటానని చెప్పినట్లు తెలిసింది.

ఆశావహులు X అన్నా వర్గీయులు...

గిద్దలూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో ఇప్పటికే అయిదు నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తయింది. మరో మూడు స్థానాలపై సందిగ్ధం నెలకొంది. వీటిలో ప్రధానంగా అందరి దృష్టీ గిద్దలూరు నియోజకవర్గంపై ఉంది. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సిటింగ్‌ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటన చేసి కలకలం సృష్టించారు. అదే సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఆరోపణలతో ప్రకంపనలు రేపారు. స్వయంగా ఎమ్మెల్యే తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో ఈ నియోజకవర్గం నుంచి ఆరేడు మంది ఆశావహులు సీటు తమకివ్వాలంటే తమకంటూ పోటీ పడుతున్నారు. సీఎంతో అన్నా రాంబాబు భేటీ తర్వాత గిద్దలూరు, మార్కాపురం అభ్యర్థులను పరస్పరం మారుస్తారనే ప్రచారం సాగింది. దీంతో ఆశావహులంతా ఒక్కటయ్యారు. స్థానికేతరులకు టికెట్‌ ఇస్తే సహించేది లేదంటూనే.. మాజీ మంత్రి బాలినేనికిస్తే పనిచేస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ సమావేశం తర్వాత రోజే బేస్తవారపేటలో అన్నా రాంబాబు వర్గం స్పందించింది. ఆయనకే టికెట్‌ కేటాయించాలంటూ శుక్రవారం రాత్రి ప్రదర్శన నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

అధిష్ఠానానికి శ్రేణుల ఝలక్‌...

కనిగిరి నియోజకవర్గంపై వైకాపా అధిష్ఠానం పునరాలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను పక్కనబెట్టి హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించింది. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బుర్రా వర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఒకానొక దశలో కాంగ్రెస్‌లో చేరాలంటూ బుర్రాపై ఒత్తిడి తెచ్చారు. తాజాగా సోమవారం ఆయన తాడేపల్లిలో పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఇక్కడ పార్టీ పునరాలోచన చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

సమన్వయకర్తలకు సహకారంపై ఆరా...

జిల్లాలో నూతన సమన్వయకర్తల నియామకం అనంతరం పార్టీ పరిస్థితిపై వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఆరా తీశారు. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ ఆదివారం రాత్రి ఒంగోలు సమీపంలోని వల్లూరు వద్దనున్న ఓ ప్రైవేట్‌ హోటల్‌ వద్ద ఆగారు. ముందుగానే సమాచారం ఉండటంతో కనిగిరి నియోజకవర్గ నూతన సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్‌, రెడ్డి కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన్ను కలిశారు. జిల్లాలో నూతన సమన్వయకర్తల నియామకం అనంతరం పార్టీ పరిస్థితిపై ఆయన వారి వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం నుంచి నూతన సమన్వయకర్తలకు ఎటువంటి సహకారం అందుతోంది, పార్టీ తరఫున ఎటువంటి సహాయం అవసరం అనే అంశాలను ఆయన నాయకులతో చర్చించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని