logo

వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి

నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు.

Published : 18 Apr 2024 03:11 IST

అర్థవీడు, న్యూస్‌టుడే

కాకర్ల వెలిగొండ ఆనకట్ట మునక ప్రాంతంలోని మొట్టిగొంది

నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. ఆ మాంసాన్ని రెండు గ్రామాల్లో విక్రయించిన ఘటన బుధవారం తాజాగా వెలుగు చూసింది.

వెలుగొండ ఆనకట్ట ఆవాసం..: వెలుగొండ ప్రాజెక్ట్‌ కాకర్ల ఆనకట్ట సమీపంలోని మొట్టిగొంది మునక ప్రాంతం వేటగాళ్లకు ఆవాసంగా మారింది. ఇక్కడి వ్యవసాయ పొలాల్లో ఉన్న 11 కేవీ విద్యుత్తు పరివర్తకాల త్రీపేజ్‌ సరఫరాతో విద్యుత్తు కంచెలను ఏర్పాటు చేసి తాగునీటి కోసం పంట పొలాల వైపు వచ్చే మూగజీవాలను మట్టుబెడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి కాకర్లకు చెందిన కొందరూ వేటగాళ్లు మొట్టిగొంది సమీపంలో విద్యుత్తు కంచె ఏర్పాటు చేసి రెండు చుక్కల దుప్పులను చంపారు. అక్కడే మాంసం తయారు చేసి కాకర్ల, నాగులవరం గ్రామాల్లో మంగళవారం ఉదయం కిలో రూ.400తో గోప్యంగా విక్రయించారు. మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారం తెలియడంతో కొందరూ ద్విచక్రవాహనాలపై మొట్టిగొంది ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం. గత నెలలో కూడా ఇదే తరహాలో దుప్పి మాంసం మొట్టిగొంది పొలాల్లోనే విక్రయించినట్లు కూడా సమాచారం.

నాగులవరం విద్యుత్తు ఉపకేంద్రం

విద్యుత్తు సిబ్బంది సహకారంతో..: వన్య ప్రాణుల వేటగాళ్లకు నాగులవరం విద్యుత్తు ఉపకేంద్రంలో పనిచేసే సిబ్బంది సహకారంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపకేంద్రం పరిధి గ్రామాల్లో తొమ్మిది గంటల త్రీపేజ్‌ విద్యుత్తు పగటి పూట మాత్రమే ఇస్తున్నారు. కానీ సోమవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము వరకు రెండు పీడర్లలో త్రీపేజ్‌ విద్యుత్తు సరఫరా ఉందని రైతులు అంటున్నారు. అయితే వన్య ప్రాణులను విద్యుత్తుతో చంపాలంటే త్రీపేజ్‌ సరఫరా అవసరం. ఈ నేపథ్యంలో మొట్టిగొందిలో సోమవారం రాత్రి రెండు దుప్పులను చంపిన ఉదంతంలో అనుమతి లేకుండా త్రీపేజ్‌ కరెంటు రాత్రంతా ఇవ్వడంలో ఉపకేంద్రం సిబ్బంది పాత్రపై అనుమానం తలెత్తుతుంది. దీనిపై విద్యుత్తుశాఖ అధికారులు సైతం రికార్డుల్లో సోమవారం రాత్రి త్రీపేజ్‌ విద్యుత్తు ఇచ్చినట్లు లేదని..ఎమ్‌ఆరై నివేదికల్లో చూడాలంటూ మాట దాటవేశారు. నాగులవరం బీటు పరిధి అటవీశాఖ అధికారులు దీనిపై నోరెత్తకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని