logo

దళిత హక్కులపై సినిమాలు నిర్మించాలి

ప్రస్తుతం దళిత హక్కుల గురించి మాట్లాడే సినిమాలను నిర్మించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.రాజు రాసిన ‘ది దళిత్‌ ట్రూత్‌’ ఆంగ్ల పుస్తకాన్ని చెన్నై పెరియార్‌ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వంటివి ఏ మేరకు నెరవేరాయనే

Published : 19 May 2022 04:56 IST

సీఎం స్టాలిన్‌ సూచన

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి, తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: ప్రస్తుతం దళిత హక్కుల గురించి మాట్లాడే సినిమాలను నిర్మించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.రాజు రాసిన ‘ది దళిత్‌ ట్రూత్‌’ ఆంగ్ల పుస్తకాన్ని చెన్నై పెరియార్‌ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వంటివి ఏ మేరకు నెరవేరాయనే విషయాన్ని అధ్యయనం చేసి పుస్తకంలో పొందుపరిచారని పేర్కొన్నారు. విద్యావేత్తలు, యువ రాజకీయ నేతలు, ఉత్తమ నిర్వాహకులు, పరిశోధకులు, సామాజిక స్పృహకలిగిన సినిమా దర్శకులు తదితర 13 మంది వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎస్సీ, ఎస్టీ ప్రజల సామాజిక న్యాయం కోసం డీఎంకే పోరాడుతోందని పేర్కొన్నారు. భారతదేశంలో దళిత్‌ సినిమా అనే వ్యాసంలో సామాజిక ఆధిక్యతకు వ్యతిరేకంగా ద్రావిడ ఉద్యమ సినిమాలు ఉన్నాయంటూ సినీ దర్శకుడు రంజిత్‌ ఉటంకించారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి, విప్లవ ప్రగతిశీల భావజాలాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు సినిమా రంగం ఓ సాధనంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. కలైజ్ఞర్‌ కరుణానిధి వారపత్రికకు రాసిన ‘ఒరే రత్తం’ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో బానిసత్వానికి వ్యతిరేకంగా ‘నందకుమార్‌’ పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు ఉదయనిధి నటించిన ‘నెంజుక్కు నీది’ చిత్రం 20న విడుదల కానుందని తెలిపారు. ఆ చిత్రం దళితులకు జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ఉంటుందని పేర్కొన్నారు. అందరూ రాజ్యాంగాన్ని అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేఎన్‌ నెహ్రూ, శేఖర్‌బాబు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, సీఎల్పీ నేత సెల్వపెరుందగై, సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌, వీసీకే శాసనసభపక్ష నేత చిందనైసెల్వన్‌, ఎండీఎంకే కార్యదర్శి దురై వైగో, ద్రావిడర్‌ కళగం ఉపాధ్యక్షుడు కలి.పూంగుండ్రన్‌, తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి అబ్దుల్‌ సమద్‌, గ్రేటర్‌ చెన్నై మేయర్‌ ప్రియ తదితరులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని