logo

మీనాక్షి అమ్మవారి కరుణ ఎవరికో?

వైగై నది ప్రహించే నగరం.. పాండ్యరాజుల రాజధాని ఉన్న నగరం.. తమిళ సంఘంతో భాషను అభివృద్ధి చేసిన ప్రాంతం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నగరం మదురై. జల్లికట్టుకు పేరొందింది.

Published : 16 Apr 2024 01:15 IST

మదురై మీనాక్షి దేవాలయం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: వైగై నది ప్రహించే నగరం.. పాండ్యరాజుల రాజధాని ఉన్న నగరం.. తమిళ సంఘంతో భాషను అభివృద్ధి చేసిన ప్రాంతం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నగరం మదురై. జల్లికట్టుకు పేరొందింది. మీనాక్షి సుందరేశ్వరర్‌, అళగర్‌ తదితర ప్రసిద్ధ చెందిన ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో చెన్నై తర్వాత రెండో అతిపెద్దది. రాజకీయపరంగా ప్రముఖమైదని. తమ బలాన్ని నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు మహాసభలు, సమావేశాలకు మదురైనే ఎంచుకుంటారు. అప్పట్లో గ్రామాలతో కూడిన నియోజకవర్గంగా ఉన్న మదురై లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెద్ద నగరాలు ఉన్న స్థానంగా మారింది. మదురైలో విజయం పార్టీ బలోపేతానికి పునాదిలాంటిదని అన్ని పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాయి. ఒక్క పార్టీకే మద్దతివ్వకుండా రాజకీయ పరిణామాలకు తగ్గట్లు నేతలను ఇక్కడి ప్రజలు ఎన్నుకుంటారు.

మారుతున్న ఫలితాలు..

2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మేలూర్‌, మదురై ఈస్ట్‌, మదురై నార్త్‌, మదురై సౌత్‌, మదురై సెంట్రల్‌, మదురై వెస్ట్‌ తదితర నియోజకవర్గాలు స్థానం పొందాయి. పునర్విభజన తర్వాత 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఎంకే అళగిరి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో అన్నాడీఎంకే అభ్యర్థి గోపాలకృష్ణన్‌ విజయం సాధించగా 2019లో డీఎంకే కూటమి నుంచి బరిలో నిలిచిన సీపీఎం అభ్యర్థి సు.వెంకటేశన్‌ 1,39,395 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

సు.వెంకటేశన్‌, శరవణన్‌, రామ శీనివాసన్‌

పోటా పోటీగా ప్రచారం..

ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డీఎంకే కూటమిలో సిట్టింగ్‌ ఎంపీ, సీపీఎం అభ్యర్థి సు.వెంకటేశన్‌, అన్నాడీఎంకే తరఫున శరవణన్‌, భాజపా అభ్యర్థి రామ శీనివాసన్‌, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థి సత్యాదేవి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సు. వెంకటేశన్‌కు మద్దతుగా సీపీఎం నేతలతోపాటు మంత్రులు మూర్తి, పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రి ఉదయనిధి, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమి పార్టీల నేతలు ప్రచారం చేసి ఆయనకు అదనపు బలాన్ని ఇచ్చారు. అన్నాడీఎంకే అభ్యర్థి డాక్టర్‌ శరవణన్‌ కోసం మాజీ మంత్రి సెల్లూర్‌రాజుతో పాటు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. డాక్టర్‌ శరవణన్‌ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతుగా ఓట్లు సేకరిస్తున్నారు. భాజపా అభ్యర్థి రామ. శీనివాసన్‌కి మద్దతుగా కేంద్రమంత్రి అమిత్‌ షా, టీటీవీ దినకరన్‌ తదితరులు ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఓట్లు తనకు వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థి సత్యాదేవి పార్టీ నేతలతో తీవ్రంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

దీర్ఘకాలిక డిమాండ్లు..

పర్యాటకం, వైద్యం, వ్యవసాయం, ఆహార పదార్థాల తయారీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, చేనేత, వర్తకం మొదలైనవి ముఖ్య వృత్తులుగా ఉన్నాయి. మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో మెరుగుపరచడం, ఉపాధి పెంచే పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలు లేకపోవడం ఈ ప్రాంతం అభివృద్ధికి ఆటంకంగా ఉంది. విద్యావంతులైన యువత ఉపాధికి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. మదురైకి ప్రకటించిన ఎయిమ్స్‌ నిర్మాణం, మెట్రో రైలు, ఐటీ పార్క్‌ మొదలైనవి ఇంకా ఆచరణలోకి రాకపోవడం ఆ ప్రాంత ప్రజలను నిరాశకు గురిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు