logo

డీఎంకే, కాంగ్రెస్‌ దేశ విరోధులు

డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు దేశవిరోధులని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. తిరునెల్వేలిలో సోమవారం జరిగిన భాజపా బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘వీళ్లు కచ్చతీవును తమిళనాడు నుంచి కోసేసి శ్రీలంకకు ఇచ్చారు.

Published : 16 Apr 2024 05:24 IST

కచ్చతీవును కోసిచ్చి పాపం చేశారు
తిరునెల్వేలి సభలో నిప్పులు చెరిగిన ప్రధాని
ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-టీనగర్‌

డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు దేశవిరోధులని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. తిరునెల్వేలిలో సోమవారం జరిగిన భాజపా బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘వీళ్లు కచ్చతీవును తమిళనాడు నుంచి కోసేసి శ్రీలంకకు ఇచ్చారు. ఇక్కడి రాష్ట్రవాసుల్ని మోసం చేసి, అబద్ధాలు చెప్పి తెరచాటు పాపం చేశారు. ఆ పాపపు ఫలితాల్ని మత్స్యకారులు 4 దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. ఈ నిజాన్ని భాజపా తమిళనాడువాసుల ముందుకు తెచ్చింది. ఇప్పుడు డీఎంకే, కాంగ్రెస్‌ నోరు మూతపడింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. డీఎంకే దగ్గర పాత టేప్‌రికార్డర్‌ ఉందని, అందులో అబద్ధాల ఎజెండా పెట్టుకున్నారని అన్నారు. ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. వాగ్దానాలు పూర్తిచేయరని, తమిళనాడు వికాసానికి పూనుకోరనేది ప్రజలకు అర్థమైపోయిందని మోదీ వివరించారు.

తాను రాసిన పుస్తకం మోదీకి అందిస్తున్న భాజపా నేత అమరప్రసాద్‌రెడ్డి

మహిళల ఆశీర్వాదం..  తమిళనాడులోని మోదీకి పూర్తిస్థాయిలో మహిళల ఆశీర్వాదం ఇస్తున్నారనేది నివేదికలు సైతం చెబుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రత్యర్థులకు అర్థంకావడంలేదని, పదేళ్లుగా భాజపా చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు కారణాలుగా ఆయన చెప్పుకొచ్చారు. దేశదుష్టులకు తాము గట్టిగా సమాధానం చెబుతూ వస్తున్నామని అన్నారు. ఇప్పుడు దేశవాసులకు ఇష్టమైన పార్టీ భాజపానేనని, తమిళభాషను ఇష్టపడేవారి ఇష్టమైన పార్టీగా భాజపా మారిందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తం చేస్తాం..తమిళనాడులోని వారసత్వ సంపద స్థలాల్ని ప్రపంచవ్యాప్తం చేసే ఆలోచనలున్నాయని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటుకు సంకల్పం చేసుకున్నామని ప్రకటించారు. డీఎంకే, కాంగ్రెస్‌ తమిళ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్నారని చెప్పారు. తాము తమిళనాడులో నిజాయితీగా పాలన అందించాలని చూస్తున్నామని అన్నారు. డీఎంకేలాంటి కుటుంబపార్టీలు కామరాజర్‌ను అవమానించేలా పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంజీఆర్‌లాంటి నేతల కలల్ని సాకారం చేయడంకోసం భాజపా ముందుకు కదులుతోందని తెలిపారు. డీఎంకే మాత్రం ఎంజీఆర్‌ను, జయలలితను అవమానించారని, ఈ విషయాల్ని తమిళనాడువాసులు మర్చిపోలేదని అన్నారు.

హాజరైన జనసందోహం, కమలం గుర్తు చూపుతున్న కార్యకర్త

డీఎంకే జాడ ఉండదు..

జూన్‌ 4 తర్వాత రాష్ట్రంలో డీఎంకే జాడ ఉండదని తిరునెల్వేలి అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌ అన్నారు. దేశంలో 400 లోక్‌సభ సీట్లు మోదీ కాళ్ల దగ్గర ఉంటాయని చెప్పారు. సభ జరుగుతున్న సమయంలో సూర్యుడు అస్తమించడాన్ని ప్రస్తావిస్తూ.. మోదీ ప్రచార సభకు వచ్చిన వెంటనే ఆకాశంలో ఉన్న సూర్యుడు కూడా అస్తమించారంటూ డీఎంకేను పరోక్షంగా విమర్శించారు. అంతకుముందు ప్రధాని మోదీ భాజపా అభ్యర్థుల్ని పరిచయం చేశారు. తిరునెల్వేలి, కన్నియాకుమరి, విరుదునగర్‌, తెన్‌కాశి ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ ప్రముఖులు మోదీని సన్మానించి జ్ఞాపిక అందించారు. భాజపా నేత అమర్‌ప్రసాద్‌ తాను రాసిన ‘కనెక్టింగ్‌ 1.4 బిలియన్‌’ పుస్తకాన్ని మోదీకి బహుమతిగా అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని