logo

దేశంలో ఎలాంటి పాలన ఉండాలి?

ఇంటికి, దేశానికి భాజపా, మోదీ హాని అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్‌(మధ్య చెన్నై) అభ్యర్థులకు మద్దతుగా నగరంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం ప్రచారం నిర్వహించారు.

Published : 17 Apr 2024 01:59 IST

ప్రచారం చేస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ఇంటికి, దేశానికి భాజపా, మోదీ హాని అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్‌(మధ్య చెన్నై) అభ్యర్థులకు మద్దతుగా నగరంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం ప్రచారం నిర్వహించారు. కొళత్తూర్‌లో జీపులో పర్యటించిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజలను, స్థానిక మైదానంలో క్రీడాకారులను పలకరించారు. సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. కొళత్తూర్‌ ఆయన మాట్లాడుతూ... కళానిధి వీరాసామి గళం పార్లమెంట్‌లో మళ్లీ వినిపించాలని తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, దేశంలో ఉండాల్సింది ప్రజాస్వామ్య పాలనా? లేక నిరంకుశత్వ పాలనా? అని నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ రద్దు చేస్తామని, చెన్నైలో మూడో రైలు టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తామని, పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని, జాతీయ జాలర్ల సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ మేనిఫెస్టో ప్రజలకు వ్యతిరేకమన్నారు. రాష్ట్రానికి వరద సాయాన్ని కూడా అందించలేదని, పదేళ్లలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఇచ్చినట్లు అబద్ధం చెబుతున్నారని ధ్వజమెత్తారు. వెంట మంత్రి పీకే శేఖర్‌బాబు, మహానగర చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, ఎంపీ గిరి, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు ఉన్నారు.

సరదాగా ఫుట్‌బాల్‌ ఆడుతూ...

భాజపా, అన్నాడీఎంకేను బహిష్కరిద్దాం

చెన్నై, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకేలను బహిష్కరిద్దామని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో.. రాష్ట్రాన్ని బలహీనపరిచే మోదీ కుట్ర నుంచి ఇప్పుడు మేల్కొనకపోతే మరెప్పుడూ మేలుకొలుపు ఉండదన్నారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాల పునర్విభజన పేరుతో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య పెంచుతారని తెలిపారు. ఇది జనాభా నియంత్రణలో ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర డిమాండ్లు, హక్కులను ఇప్పటికే మోదీ గౌరవించడంలేదన్నారు. లోక్‌సభలో రాష్ట్ర ప్రాతినిథ్యం మరింత తగ్గితే రాష్ట్రాన్ని భాజపా ప్రభుత్వం చెల్లనికాసు చేస్తోందని విమర్శించారు. పన్నుల కేటాయింపుల్లో ఇప్పటికే పక్షపాతం ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ హక్కులు హరించి, తమిళనాడు మేథోగళాన్ని నొక్కి, రెండోస్థాయి పౌరులుగా మార్చే మోదీ సర్కారుకు ముగింపు పలుకుదామంటూ పిలుపునిచ్చారు. మోదీకి చెందిన భాజపాకు, ఎడప్పాడి పళనిసామికి చెందిన అన్నాడీఎంకేకు ఓటు వేయడానికి పెద్దగా తేడా లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు