logo

అందరితో ఓటేయిస్తాం

చెన్నై మహానగరంలో పలు గృహ సంక్షేమ సంఘాలు అందరూ ఓటు వేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌శాతం చాలా తక్కువ నమోదైంది.

Published : 17 Apr 2024 02:04 IST

గృహ సంక్షేమ సంఘాల ప్రత్యేక చొరవ

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మహానగరంలో పలు గృహ సంక్షేమ సంఘాలు అందరూ ఓటు వేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌శాతం చాలా తక్కువ నమోదైంది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.

నిర్వహణ ఛార్జీల్లో తగ్గింపు..

సీనియర్‌ సిటిజన్లను పోలింగు కేంద్రాలకు తీసుకెళ్లి వారితో ఓటు వేసేందుకు సహకరించడానికి వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఓటుతో ప్రయోజనాలపై అందరికీ తెలిసేలా పేరడీ పాటలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఓ గృహ సంక్షేమ సంఘం ప్రతినెలా వసూలు చేస్తున్న నిర్వహణ ఛార్జీ తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. వేలికి సిరా గుర్తు చూపించడం లేదా ఆ ఫొటో తీసి గ్రూపులో పెడితే సదరు వ్యక్తికి 10 శాతం మినహాయింపు ఇస్తామని ఓఎమ్మార్‌ కారపాక్కంలోని వైకుంఠ్‌ సుందరం అపార్ట్‌మెంట్స్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.దండపాణి ప్రకటించారు. ఇక్కడి కాంప్లెక్సులో 362 ఫ్లాట్లున్నాయి. ఒక్కో ఫ్లాటు నిర్వహణ కింద నెలకు రూ.2,500 చెల్లిస్తోంది. ఉదాసీనత కారణంగా ఎక్కువమంది ముందుకు రావడం లేదు. నిర్వహణ ఛార్జీలో తగ్గింపు ప్రకటించడంతో మంచి ఫలితం కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గంలో కారపాక్కం ఒక భాగం. రాష్ట్రంలోకెల్లా ఇక్కడ తక్కువ మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ 57శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది.

మందవెల్లిలో..

దక్షిణ చెన్నై పరిధిలోని మందవెల్లిలో కూడా గృహ సంక్షేమ సంఘం.. సీనియర్లు, దివ్యాంగులకు యువత సహకరించాలని విజ్ఞప్తి చేసింది. తమ సంఘంలో ముగ్గురు దివ్యాంగులు, వృద్ధులు పది మంది ఉన్నారని, వారి కుటుంబాల తరపున చిన్న వయసు వారెవరూ లేరని సంఘ సభ్యుడు గంగాశ్రీధర్‌ అన్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేషన్‌ అధికారులకు దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీ, ర్యాంప్‌ సదుపాయం కల్పించాల్సిందిగా కోరామని ఆయన చెప్పారు.

పేరడీ పాటలతో..

చిట్లపాక్కం గృహవాసులు, సంఘాలు 1985లో విడుదలైన ‘పడిక్కాదవన్‌’(చదువుకోని వాడు) తమిళ చిత్రంలోని ‘ఊర తెరింజికిట్టేన్‌’(ఊరు గురించి తెలుసుకున్నాను) అనే పాటకు పేరడీని సృష్టించి ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వారంరోజుల సమయం పట్టిందని చిట్లపాక్కం నివాసి సునీల్‌ జయరామ్‌ చెప్పాడు. ఈ పేరడి పాటను ఆరుమంది తిరగరాశారు. రాజకీయ పార్టీల నుంచి నగదు తీసుకోకుండా ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడానికి సంబంధించిన పాట అన్నారు. బుధవారం విడుదల చేస్తామని, యువతను బాగా ఆకట్టుకోగలదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు