logo

స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్లు..

సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి ఒనగూరిన లబ్ధిని వివరిస్తూ ‘మూడో ఏటా సంక్షేమ బావుటా’ పేరిట ప్రభుత్వం ముద్రించిన బ్రోచర్లలో ఉద్దండపురంలో కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపించడం విమర్శలకు దారితీస్తోంది.

Published : 01 Oct 2022 03:47 IST

సంక్షేమ బ్రోచర్లలో సిత్రాలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి ఒనగూరిన లబ్ధిని వివరిస్తూ ‘మూడో ఏటా సంక్షేమ బావుటా’ పేరిట ప్రభుత్వం ముద్రించిన బ్రోచర్లలో ఉద్దండపురంలో కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపించడం విమర్శలకు దారితీస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేట ఎమ్మెల్యే నక్కపల్లి మండలం ఉద్దండపురంలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముద్రించిన బ్రోచర్లను సచివాలయ ఉద్యోగులు గ్రామంలో పథకాలు పొందుతున్న వారందరికీ వాలంటీర్లతో పంపిణీ చేయించారు. ఇందులో కొందరికి ఇంటి స్థలం ఇవ్వకపోయినా ఇచ్చినట్లు ముద్రించడంతో లబ్ధి పొందని వారు వీటిని చూసి అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన కుర్రా వెంకటలక్ష్మికి సున్నా వడ్డీ, అమ్మఒడి, వాహన మిత్ర, ఆసరా పథకాల ద్వారా రూ.67,166, అదే విధంగా రూ.2 లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చామని, త్వరలోనే ఇల్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేరుస్తామని ఉంది. కొంతం గౌరీకి¨ అమ్మఒడి, కాపు నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ ద్వారా రూ.79,575, రూ.2 లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చామని, త్వరలోనే ఇల్లు ఇచ్చి సొంతింటి కల నెరవేరుస్తామంటూ ఇందులో పేర్కొన్నారు. వాస్తవంగా వీరికి ఇంటి స్థలం ఇవ్వలేదు. వీటిని చూసిన వీరిద్దరూ కంగుతిన్నారు. ఇంటి స్థలం కోసం చాన్నాళ్లుగా నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు ఇవ్వలేదని, ఇప్పుడు ఏకంగా బ్రోచర్లలో స్థలం ఇచ్చినట్లు రావడంపై మండిపడుతున్నారు. ఇవ్వని పథకాలను ఇచ్చినట్లు ఎలా చూపుతారని, ఇప్పటికైనా స్థలం కేటాయించాలని కోరుతున్నారు. ఈ విషయమై సచివాలయ కార్యదర్శి నాగరాజుతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా.. కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే లబ్ధి జరిగినట్లు బ్రోచర్లలో వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందన్నారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి వారంతా కార్యాయానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, ఇలా ఎంతమందికి వచ్చాయనే విషయాన్ని వాలంటీర్ల ద్వారా సేకరించి రెవెన్యూ, హౌసింగ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని