logo

స్పందనకు 155 అర్జీలు

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 155 మంది అర్జీలు అందజేశారు.

Published : 21 Mar 2023 03:28 IST

అర్జీలు స్వీకరిస్తున్న జేసీ కె.ఎస్‌.విశ్వనాథన్‌, ఇతర అధికారులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 155 మంది అర్జీలు అందజేశారు. ఉపాధి పథకాలు అమలు చేయాలని, రేషను కార్డుల్లో దొర్లిన తప్పిదాలను సరి చేయాలని, కార్డులను పునరుద్ధరించాలని, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని పలువురు వినతులు అందజేశారు. కలెక్టర్‌ మల్లికార్జున విజయవాడకు వెళ్లడంతో జేసీ కె.ఎస్‌. విశ్వనాథన్‌, డీఆర్వో ఎస్‌.శ్రీనివాసమూర్తి, ఏసీపీ బాపూజీ తదితరులు అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. పెట్టుబడిదారుల సదస్సు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేసినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. ఈనెల 22న ఉగాది వేడుకలను వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, అధికారులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

* భీమిలి మండలం జేవీ అగ్రహారం పంచాయతీ శివారు కొత్తవలస గ్రామంలో రైతుల నుంచి భూములు సమీకరించారని, ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వలేదని పలువురు రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. 2019 నుంచి ఈ వ్యవహారం నలుగుతోందని, భూములు తీసుకోవడంతో ఫలసాయం కోల్పోయామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

జీవీఎంసీలో...: కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన స్పందనకు కార్యక్రమానికి 74 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ వాటిని స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్‌-1కు ఒకటి, జోన్‌-2 ఏడు, మూడో జోన్‌కు 16, జోన్‌ 4కు 10, ఐదో జోన్‌కు 12, ఆరో జోన్‌కు 14, ఏడో జోన్‌కు ఒకటి, జోన్‌-8కు 9, ప్రధాన కార్యాలయానికి 4 చొప్పున వచ్చాయి. వాటిలో పరిపాలనకు రెండు, రెవెన్యూకు 12, ప్రజారోగ్య విభాగానికి మూడు, పట్టణ ప్రణాళికకు 37, ఇంజినీరింగ్‌కు 11, ఉద్యానవన విభాగానికి 3, యూసీడీకి ఆరు చొప్పున ఉన్నాయి.

పోలీసు స్పందనకు: ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : పోలీసు శాఖ నిర్వహించిన స్పందనకు 53 అర్జీలు వచ్చాయి. సోమవారం పోలీసు సమావేశ మందిరంలో జరిగిన స్పందనలో ఏడీసీపీ(పరిపాలన) ఎం.ఆర్‌.కె.రాజు పాల్గొని ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని, సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాధితులతో మాట్లాడారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఏడీసీపీ  ఎంఆర్‌కే రాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని