logo

రూ.2 కోట్లు బూడిదలో పోసినట్టేనా..

మహా విశాఖ నగరపాలక సంస్థ మెకానికల్‌ విభాగం ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.2 కోట్ల విలువైన వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి.

Published : 05 Jun 2023 03:51 IST

తుప్పల్లో ‘సీసీఎస్‌’ వాహనాలు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ముడసర్లోవ యార్డు తుప్పల్లో క్లోజ్డ్‌ కాంపాక్షన్‌ వాహనాలు

మహా విశాఖ నగరపాలక సంస్థ మెకానికల్‌ విభాగం ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.2 కోట్ల విలువైన వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి. రెండేళ్ల క్రితం వీటిని కొనుగోలు చేసినా వినియోగించకుండా మూలన పెట్టారు. మరో పక్క అద్దె ప్రాతిపదికన వాహనాలను తీసుకుని గుత్తేదారుకు ఏడాదికి రూ.70లక్షలు చెల్లిస్తుండడం గమనార్హం.

* నగరంలో పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి జోన్‌-2 పరిధి ముడసర్లోవలో సీసీఎస్‌(క్లోజ్డ్‌ కాంపాక్షన్‌ సిస్టమ్‌) కేంద్రాన్ని నిర్మించి చెత్త బయటకు కనిపించకుండా నిల్వ చేసి, తరలించే ప్రాజెక్టును రెండున్నరేళ్ల క్రితం రూ.8.5 కోట్ల వ్యయంతో జీవీఎంసీ ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా క్లాప్‌ వాహనాలు చెత్తను సీసీఎస్‌ కేంద్రానికి తీసుకొస్తాయి. అక్కడ నిల్వ ఉంచిన చెత్తను తరలించడానికి నాలుగు క్లోజ్డ్‌ కాంపాక్షన్‌ వాహనాలను గుత్తేదారు సమకూర్చాల్సి ఉంటుంది.

* ఏటా రూ.70లక్షల నష్టం: రెండేళ్ల కిందట నాలుగు సీసీఎస్‌ వాహనాల కొనుగోలు సందర్భంగా కంపెనీ ఇచ్చిన మరమ్మతుల గ్యారంటీ గడువు పూర్తయింది. ప్రస్తుతం ప్రాజెక్టు తిరిగి ప్రారంభమైన దృష్ట్యా మూలనపెట్టిన వాహనాలను వినియోగిస్తారా లేదా అనే అంశంపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. వాటిని అందుబాటులోకి తెస్తే ఇన్నాళ్లు పక్కన పెట్టినందుకు ఇంజినీరింగ్‌ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలను నిరుపయోగంగా మూలన పెట్టిన అధికారులు మరో వైపు చెత్తను తరలించడానికి అవసరమైన వాహనాల కోసం టెండరు ఆహ్వానించారు. దీనికిగాను గుత్తేదారులకు ఏటా రూ.70లక్షలు ఇవ్వడానికి అంగీకరించడం గమనార్హం. కొందరికి లాభం చేకూర్చడానికే సీసీఎస్‌ వాహనాలను వినియోగంలోకి తీసుకురాకుండా వ్యూహాత్మకంగా పక్కన పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల తీరు కారణంగా జీవీఎంసీకి ఏటా రూ.70 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రాజెక్టును మధ్యలో ఆపేసిన గుత్తేదారు

* ప్రాజెక్టును దక్కించుకున్న గుత్తేదారు 20శాతం మేర సీసీఎస్‌ కేంద్రం పనులు చేశారు. నాలుగు వాహనాలను కూడా కొనుగోలు చేశారు. అనంతరం బిల్లుల కోసం జీవీఎంసీని సంప్రదించగా మధ్యలో నిధులు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో గుత్తేదారు ప్రాజెక్టును మధ్యలో వదిలేశారు. కొనుగోలు చేసిన వాహనాలను జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించగా, వాటిని ముడసర్లోవ సమీపంలోని స్కిల్‌ డెవలప్‌మెంటÂ కేంద్రం పక్కనున్న యార్డులో ఉంచారు. అలా రెండేళ్లపాటు అవి నిరుపయోగంగా మారి తుప్పు పట్టిపోతున్నాయి. తాజాగా అధికారులు గుత్తేదారుతో సంప్రదించి ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరారు. దీంతో సీసీఎస్‌ కేంద్రం నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని