logo

మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!

నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు.

Updated : 18 Apr 2024 05:36 IST

కొండలపై జనం గోడు పట్టించుకోని ప్రభుత్వం
ఓటుతో బుద్ధి చెబుతాం అంటున్న జనం
ఈనాడు-విశాఖపట్నం

కొండవాలు ప్రాంతాల్లో
పేదల ఓట్లైతే కావాలి..
వాళ్ల ప్రాణాలంటే మాత్రం
ముఖ్యమంత్రి జగన్‌కు పట్టదు!
పన్నులైతే ముక్కుపిండి వసూలు చేస్తారు
అభివృద్ధి చేయాలన్న ధ్యాసమాత్రం లేదు!

మౌలిక సదుపాయాలు కల్పించండని మొత్తుకున్నా పట్టించుకోరు!
వర్షాకాలం చినుకురాలితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
కొండవాలున ఇళ్లల్లో బిక్కుబిక్కుమని బతకాల్సిందే!!

ఎన్నాళ్లిలా... ఎన్నేళ్లిలా!
వినతులు ఇచ్చినా పట్టించుకోరా అని వైకాపా ప్రభుత్వంపై
జనం మండిపడుతూ... ఎన్నికల్లో తగు తీర్పు ఇస్తామని శపథం చేస్తున్నారు.

గరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. హనుమంతువాక నుంచి సింహాచలం వరకు విస్తరించిన కొండవాలులో హనుమంతువాక, పెదగదిలి, చినగదిలి ప్రాంతాలున్నాయి. డెయిరీఫారం నుంచి రవీంద్రనగర్‌ వరకు కొండవాలుంది. వెంకోజీపాలెం, హెచ్‌బీ కాలనీ, మాధవధార, సీతమ్మధార, తాటిచెట్లపాలెం, కైలాసపురం, కంచరపాలెం, గోపాలపట్నం పరిధిలో కొండవాలున పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించుకుని మధ్యతరగతి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గాజువాక పరిధిలో కొండవాలున ఏడు కాలనీలున్నాయి. ఇక్కడ జనం నివశించేచోట రక్షణ చర్యలు చేపట్టాలన్న ఆలోచనే వైకాపా పాలకవర్గానికి లేదు. కానీ, ఓ కొండను ఆనుకుని ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు నష్టం కల్గకుండా మాత్రం రూ.కోట్లు కుమ్మరించారంటే వారి శ్రద్ధ వేటిపై ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం దాగి ఉన్న ప్రాంతాలపై ఇప్పటి వరకు కనీసం నిపుణులతో సర్వే కూడా చేయలేకపోయారు. రక్షణ చర్యలపై జీవీఎంసీ పాలక వర్గంలో పెట్టి చర్చించనేలేదు.


ఆ పార్టీ నేతలకు అనుకూలంగా...

ధ్యతరగతి కుటుంబాలు దశాబ్దాల తరబడి కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్నా, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మహా విశాఖ నగరపాలక సంస్థ పూర్తిగా వెనుకబడింది. ఐదేళ్ల వైకాపా పాలనలో అధికార పార్టీ నాయకుల ఆస్తులకు ధరలు పెరిగేలా అభివృద్ధి పనులు మాత్రం సాగాయి. ఇటీవల తూర్పు నియోజకవర్గంలో ఓ కొండకు ఆనుకుని ఉన్న అపార్టుమెంట్లకు నష్టం వాటిల్లకుండా రూ.2కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదించడం గమనార్హం.


నిత్యం నరకమే: కొండలపై, కొండవాలులోని ఇళ్లకు చేరుకోవాలంటే సక్రమమైన మెట్లు, రహదారులు నేటికీ లేవు. వృద్ధులు, చిన్నారులు, రోగులు  రాకపోకలు సాగించడానికి అవస్థలు పడక తప్పటం లేదు. సింహాచలం దేవస్థానం భూముల్లో నివసిస్తున్నవారికి మౌలిక వసతులు కల్పించడానికి వీల్లేకుండా దేవస్థానం గార్డులు జీవీఎంసీని అడ్డుకుంటున్నారు. దీంతో వారికి తాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. జీవీఎంసీ కొన్నికొండవాలు ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేసినా, వేసవిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం, ఇటీవల విద్యుత్తు కోతలు అధికమవడంతో కొండలపైకి నీటిని పంపింగ్‌ చేయలేకపోతున్నారు.  ప్రణాళికాధికారులు నిర్మాణాల సమయంలో క్రమబద్ధీకరించకపోవడంతో కొండలపైనా ఇరుకు సందులు దర్శనమిస్తున్నాయి. బడ్జెట్‌లో అధిక భాగం నిధులు పేదలున్న చోట వ్యయం చేయాల్సి ఉన్నా, జీవీఎంసీ ఆ విధంగా వ్యవహరించడంలేదు.


ప్రాణాలు పోతున్నా..

  • గాజువాక పరిధిలోని సింహగిరి కాలనీలో నాలుగేళ్ల కిందట కొండచరియలు విరిగిపడి భార్యభర్తలు మృతిచెందారు.
  • వర్షాకాలంలో కొండచరియలు పడి సాగర్‌నగర్‌లో ఇద్దరు, పెదగదిలి ప్రాంతంలో ఒకరు, రవీంద్రనగర్‌లో ఒకరు, తాటిచెట్లపాలెంలో ఇద్దరు గత ఐదేళ్ల కాలంలో మృత్యువాత పడ్డారు.
  • చాలా మంది క్షతగాత్రులుగా మిగిలారు.
  • ఇటీవల పాతనగరం సత్యనారాయణ కొండపై ఇల్లు కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని