logo

వైఎస్సార్‌ బీమా.. ఏదీ ధీమా..

కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Published : 10 May 2024 04:20 IST

లబ్ధిదారులను ఆదుకోవడంలో తీవ్ర జాప్యం చేసిన జగన్‌
కంటితుడుపు పథకంగా మారిపోయిందన్న ప్రజలు

న్యూస్‌టుడే, పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం: కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వైఎస్సార్‌ బీమా పథకం కంటితుడుపు పథకంగా మారిపోయింది. తెదేపా హయాంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేసిన చంద్రన్న బీమా పథకానికి జగన్‌ పేర్లు మార్చి నిబంధనలు కఠినతరం చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేశారు. గతంలో నమోదు, సహాయం కోసం ప్రతి మండలానికీ ఒక బీమా మిత్రను ఏర్పాటు చేశారు. ఎవరికైనా మరణం సంభవిస్తే దహన సంస్కారాల కోసం తక్షణమే కుటుంబ సభ్యులకు రూ.5 వేలు అందించేవారు. అనంతరం పదిహేను రోజుల్లోగా క్లెయిములు చెల్లించి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేవారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ బీమా పథకం అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.


క్లెయిముల కోసం ఎదురు చూపులు: గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఎంతో సమర్థంగా అమలయ్యేది. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ బీమా క్లెయిములు అందక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పెందుర్తిలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మరణించాడు. రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ బీమా క్లెయిము అందలేదు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. బీమా రక్షణ లేకపోతే ప్రజల జీవితానికి భరోసా ఎలా కల్పిస్తారు.

రెడ్డి నారాయణరావు, రాంపురం


ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: మాది పేద దళిత కుటుంబం. కూలీ నాలీ చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. నా భర్త రెండేళ్ల క్రితం పశువులు తోలుకుని వెళ్లి చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నాకు ఇద్దరు సంతానం. వైఎస్సార్‌ బీమా పథకానికి దరఖాస్తు చేసినా ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదు. సచివాలయం అధికారులను పలుమార్లు విన్నవించినా సమాధానం లేదు. స్పందన కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులను రెండు సార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

నేతల ఈశ్వరమ్మ, భరణికం


కుటుంబం గడవడం కష్టంగా మారింది..: నా భర్త గ్రామాల్లో పాల వ్యాపారం చేసి తమను పోషించేవాడు. రెండేళ్ల క్రితం ఇంటిబోరు వద్ద పాలక్యాన్లు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మాకు ఇద్దరు సంతానం. వైఎస్సార్‌ బీమాకు దరఖాస్తు చేశాను సచివాలయ సిబ్బంది వచ్చి రూ.10 వేలు ఇచ్చారు. మిగతా సొమ్ము రూ.4.90 లక్షలు ఇప్పటికీ రాలేదు. సచివాలయ సిబ్బందిని అడిగితే రిపోర్టులు పంపించాం వస్తుందని చెబుతున్నారే తప్ప రెండేళ్లయినా రాలేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఇక్కట్లు పడుతున్నాం.

జనపాల సంతోషి, మరిశవానిపాలెం


ప్రత్యేక విభాగం పనిచేసేది..: గతంలో చంద్రన్న బీమా నమోదుకు ప్రత్యేక విభాగం 24 గంటలు పని చేసేది. ఎవరైనా చనిపోతే కాల్‌ సెంటరుకు ఫోన్‌ చేస్తే వెంటనే స్థానిక ఆరోగ్య సహాయ కార్యకర్తకు సమాచారం వచ్చేది. ఆ కార్యకర్త మరణించిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి వారిని ఓదార్చి తక్షణ సహాయం కింద రూ.5 వేలు అందజేసేవారు. దరఖాస్తులు ఎలా, ఎక్కడ చేయాలనే విషయాలను వారికి వివరించి మిగిలిన నగదు అందేలా చేసేవారు. వైకాపా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు.

పొలమరశెట్టి పెద్దినాయుడు, చింతలగ్రహారం


ఈ పథకం గురించి చాలామందికి తెలీదు..: గతంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకం కుటుంబానికి భరోసాగా ఉండేది. కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా రూ.5 లక్షలు బీమా కింద చెల్లించేవారు. ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహాయ పడేది. ప్రస్తుతం వైఎస్సార్‌ బీమా పథకం గురించి చాలా మందికి తెలీదు. గతంలో ఎవరైనా చనిపోతే వారి డబ్బులు అందితే ఊరంతా చెప్పుకునేవారు. ఇప్పుడు ఎవరికీ ఇవ్వకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు.

ఎం.ఎం.కె. ప్రవీణ్‌, బాటజంగాలపాలెం


గతంలో వెంటనే నగదు జమయ్యేది..: చంద్రబాబు హయాంలో బీమా సొమ్ము వెంటనే వారి కుటుంబ సభ్యుల ఖాతాలో జమ చేసేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పథకం రూపురేఖలే మార్చేశారు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి మంచి పథకాలను అటకెక్కేంచేసి సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. 

ఆళ్ల తాతారావు, లక్ష్మీపురం


కుటుంబాలు వీధిన పడుతున్నాయి..: కుటుంబాలకు ఎంతో భరోసాగా నిలుస్తున్న బీమా పథకాలను జగన్‌ సక్రమంగా అమలు చేయకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గతంలో ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 లక్షలు, సాధారణ మృతి అయితే రూ.2 లక్షలు ఇచ్చేవారు. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. కుటుంబ యజమాని చనిపోతే వారిపై ఆధారపడిన వారు ఈ పథకం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేవారు.

కర్రి నర్సింగరావు, అసకపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని