logo

అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం

ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్‌ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు.

Published : 10 May 2024 04:44 IST

మార్పునకు నాంది పలకండి విశాఖపై నా ప్రేమ శాశ్వతం
‘ప్రజాగళం’ సభలో తెదేపా అధినేత చంద్రబాబు

మాట్లాడుతున్న చంద్రబాబు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, సీతంపేట, గురుద్వారా: ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్‌ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. సీతంపేట కూడలిలో గురువారం రాత్రి నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని మాట్లాడారు.
ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అధికారం కోల్పోతారని చంద్రబాబు వివరించారు. ఎండ ఎక్కువగా ఉందని ఇంట్లో కూర్చోకుండా.. బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరూ ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, మార్పునకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేయించారు. మంచి వ్యక్తులు అధికారంలోకి వస్తే జీవితాలు బాగుపడతాయని, చెడ్డ వ్యక్తుల ద్వారా నాశనమవుతాయని వివరించారు. ఓటుతోనే ఐదేళ్ల వైకాపా అరాచక పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌కు దీటుగా మారుస్తా

 ‘విశాఖ నగరంపై నా ప్రేమ శాశ్వతం. అందమైన...నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతా. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నగరంలో ఎక్కడా గుంతలు లేకుండా రోడ్లు నిర్మాణం చేపడతాం. ఉత్తర నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ వరకు 60 అడుగుల రోడ్డు పూర్తి చేస్తాం. ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా చూసే బాధ్యత నాది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత నీరు సరఫరా చేస్తాం. కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు రోడ్లు, నీరు, విద్యుత్తు సదుపాయాలు కల్పిస్తాం. ‘తూర్పు’లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసి మురుగు సమస్య నివారిస్తాం. హుద్‌హుద్‌ సమయంలో తెదేపా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను బాధితులందరికీ అందజేస్తాం. పట్టాలు లేనివారికి ఇళ్ల పట్టాలు ఇస్తాం. ‘దక్షిణం’లో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. పోర్టు నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించి విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్న చంద్రబాబునాయుడు

మహిళలకు వడ్డీ లేని రుణాలు..

‘ప్రధాని మోదీ సహకారంతో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. పట్టణ ప్రాంత మహిళలకు ఆదాయం పెంచుతాం. ప్రతి నెలా 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు రూ.1500, ‘తల్లికి వందనం’ కింద  ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందజేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను అందజేస్తాం’ అని చంద్రబాబు వివరించారు.

తెదేపా అధినేతతో కలిసి ఎన్నికల గుర్తు చూపుతున్న ఉత్తరం అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు

మంచిని గెలిపించండి

‘ఉత్తరం’లో భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు ఓ రౌడీపై పోరాడుతున్నారని, మంచిని గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీభరత్‌, తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, భీమిలి అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌ రాజు, వంశీకృష్ణ, గంటా శ్రీనివాసరావులను పరిచయం చేశారు. సైకిల్‌, గాజుగ్లాసు, కమలం పువ్వు గుర్తులకు ఓటేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మీ ఓటుతో దిమ్మదిరిగే సమాధానం చెప్పాలన్నారు.  ‘ప్రజాగళం’ సభకు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఆ కూడలి జనసంద్రమైంది. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్‌ తదితరులు పాల్గొన్నారు. ః ప్రజాగళం సభ తరువాత గురువారం రాత్రి చంద్రబాబు నగరంలోని పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులందరితో విడివిడిగా మాట్లాడారు.

ఎమ్మెల్యే అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి, గణబాబు, వంశీకృష్ణలను పరిచయం చేస్తున్న చంద్రబాబు

 

చంద్రబాబుతో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని