logo

మిల్లుల ధాన్యం మార్కెట్‌ షెడ్‌లో నిల్వపై వివాదం

మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వకు చోటు లేక ఇబ్బందులు మొదలయ్యాయి. మిల్లుల్లో చోటు లేదనే కారణంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలోని రెండు కవర్‌షెడ్లలోకి దించాలని జిల్లా అధికారులు ఆదేశించారు.

Published : 29 May 2022 03:56 IST


ధాన్యాన్ని మార్కెట్‌ షెడ్‌కు తరలించొద్దంటూ నిరసన తెలుపుతున్న హమాలీలు, కార్మిక వర్గాలు

జనగామ, న్యూస్‌టుడే: మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వకు చోటు లేక ఇబ్బందులు మొదలయ్యాయి. మిల్లుల్లో చోటు లేదనే కారణంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలోని రెండు కవర్‌షెడ్లలోకి దించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ ప్రతిపాదనను మార్కెట్‌ కమిటీ ప్రతినిధులు, వ్యాపార, కార్మిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. శనివారం లారీల నుంచి సరకు దించనీయలేదు. హమాలీ, దడువాయి, గుమాస్తా, అడ్తీ, ఖరీదుదారుల సంఘాల ప్రతినిధులు, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయను కలిసి మాట్లాడారు. మరో వైపు మిల్లర్లు జేసీ ఆదేశాలను అనుసరించి చోటు కల్పించాలని కోరారు. ఇంకా రబీ సీజన్‌ ప్రైవేటు కొనుగోళ్లు జరుగుతున్నాయని, షెడ్లను కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యానికి కేటాయిస్తే, రైతులు ఆరుబయట పోసి విక్రయించాల్సి వస్తుందని వాపోయారు. తెరాస నాయకుడు సిద్దిలింగం పలు ప్రతిపాదనలు చేసి మిల్లర్లను ఒప్పించే ప్రయత్నం చేశారు. పత్తియార్డులో షెడ్లు ఉపయోగించుకోవాలన్నారు. మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రెండు షెడ్లను ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే గతేడాది దించిన ధాన్యాన్ని తీసుకువెళ్లలేదని, అదే షెడ్డును వినియోగించుకుని, ఆగస్టు 15కల్లా ఖాళీ చేయాలని ప్రతిపాదించారు. తహసీల్దార్‌ రవీందర్‌ ఇరువర్గాలతో మాట్లాడారు. పత్తియార్డుతోపాటు, పాత యార్డు ఆవరణలోని ఒక షెడ్డు ఇస్తామనే ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ఛైర్‌పర్సన్‌ విజయ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని