logo

నాణ్యత నీటిపాలు

ప్రారంభానికి ముందే కోట్ల విలువ చేసే అభివృద్ధి పనుల్లో నాణ్యత తేలిపోయింది.. చెక్‌డ్యాంతో కూడిన వంతెన నాణ్యత మహాముత్తారం మండలంలో ముణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది.

Published : 27 Jan 2023 06:02 IST

పగుళ్లు ఏర్పడి వంతెన చెక్‌ డ్యాం నుంచి కారుతున్న నీరు

న్యూస్‌టుడే, మహాముత్తారం: ప్రారంభానికి ముందే కోట్ల విలువ చేసే అభివృద్ధి పనుల్లో నాణ్యత తేలిపోయింది.. చెక్‌డ్యాంతో కూడిన వంతెన నాణ్యత మహాముత్తారం మండలంలో ముణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. మారుమూల అటవీ గ్రామం సింగంపల్లి వద్ద పెద్దవాగుపై రోడ్లు భవనాల శాఖ 2017లో రూ.6.25 కోట్ల నిధులతో హైలెవల్‌ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది పనులు పూర్తికాగా అధికారికంగా ప్రారంభించలేదు. అప్రోచ్‌ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంది. గత జులైలో భారీ వరదలు రావడంతో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. వంతెన పిల్లర్ల మధ్య నిర్మించిన చెక్‌ డ్యాంలో చుక్క నీరు నిల్వ ఉండటం లేదు. అడ్డుగోడల కింది భాగం నుంచి నీరు బయటికి వస్తూ వృథాగా పోతోంది. చెక్‌డ్యాం కింది భాగంలో నిర్మించిన రక్షణ కవచం నిర్మాణంలో గుత్తేదారు నిబంధనలను గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఇసుకపైనే నిర్మించడంతో వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల పగుళ్లు బారిన కవచం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రక్షణ కవచం దెబ్బతినడంతో మరోసారి వరదలు వస్తే వంతెన దెబ్బతిని ఒకవైపు ఒరిగిపోయే ప్రమాదం నెలకొంది. వర్షకాలంలో మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై రోడ్లు భవనాలు శాఖ మహాముత్తారం ఏఈ అవినాశ్‌ను చరవాణి ద్వారా వంతెనను పరిశీలించి చర్యలు చేపడుతామని చెప్పారు.


గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి..

రాజ్‌కుమార్‌, సింగంపల్లి

మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో నాణ్యతను ఎవరూ ప్రశ్నించని రోడ్లు, భవనాల శాఖ అధికారులు, గుత్తేదారులు ఇలాంటి నాణ్యతలేని పనులు చేస్తున్నారు. ఏళ్ల పాటు అరణ్య రోదన అనుభవించిన అటవీ గ్రామాల ప్రజలకు వంతెన కష్టాలు తీరుతాయని అనుకున్నాం. సింగంపల్లి వంతెనను చూస్తే భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోంది. నాణ్యత లేకుండా పనులు చేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని