logo

ఉపాధికి జనరిక్‌

జనరిక్‌ మందులు.. మధ్య, పేద తరగతి ప్రజలకు వరం. చాలా తక్కువ ధరకు లభిస్తాయి.. అయితే అవగాహన అంతంత మాత్రమే.. దుకాణాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి.

Published : 09 Feb 2023 05:55 IST

దుకాణాల ఏర్పాటుకు స్త్రీ నిధి రుణాలు
న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్‌

జనరిక్‌ మందులు.. మధ్య, పేద తరగతి ప్రజలకు వరం. చాలా తక్కువ ధరకు లభిస్తాయి.. అయితే అవగాహన అంతంత మాత్రమే.. దుకాణాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షాపుల ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. వీటి ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలని సరికొత్తగా అడుగులు వేస్తోంది.

స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు స్త్రీ నిధి ద్వారా జనరిక్‌ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కరికి రూ. 3 లక్షల రుణం ఇవ్వనుంది. ఎంత మంది అర్హులంటే అందిరికీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా అర్హులకు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రుణాల మంజూరుకు స్త్రీనిధి నిబంధనలను సడలించారు. ఆసక్తి, అవగాహన ఉన్న మహిళా సంఘాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

అవగాహన అవసరం

దేశంలో జనరిక్‌ మందులకు ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రజలకు సరైన అవగాహన లేక, పలు అనుమానాలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఈ మందులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో మహిళలకు ఉపాధి కల్పించే విధంగా దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలి. మహిళా సంఘాలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి ఏ విధంగా ఉంటుందో వివరించాలి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేవలం 100 దుకాణాలు మాత్రమే ఉన్నాయి.

నిబంధనలు ఇవే

* మహిళా సంఘాల్లో సభ్యులు మాత్రమే కాదు.. వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సభ్యులకు రుణాలు అందిస్తారు. * తప్పని సరిగా డీఫాం, ఎంఫాం, బీఫార్మసీ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. * షాపు ఏర్పాటు చేసుకునే వారు కనీసం 120 గజాల స్థలాన్ని చూపించాలి. * ఇప్పటికే అల్లోపతి మెడికల్‌ దుకాణం ఉంటే దానికి అదనంగా జనరిక్‌ మెడికల్‌ షాపు ఏర్పాటుకు రుణం పొందవచ్చు. * అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లందరికీ రుణలు అందజేస్తారు.


ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-ఎం.అశోక్‌, స్త్రీనిధి రీజినల్‌ మేనేజర్‌, హనుమకొండ జిల్లా

జిల్లాలోని మహిళా సంఘాల సభ్యుల్లో ఎవరికైనా జనరిక్‌ మెడికల్‌ దుకాణం ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి ఉంటే గ్రామైఖ్య సంఘాలను గానీ, స్త్రీనిధి అధికారులను గానీ సంప్రదించాలి. రూ.3లక్షల వరకు రుణం అందించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని