logo

రాష్ట్రపతి నిలయాన్ని చూద్దామిలా!

భారత రాష్ట్రపతి నిలయం.. తలుచుకుంటేనే చూడాలనిపించే అందమైన భవనం. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది భవనాన్ని సందర్శకులు చూసేలా నిబంధనలను సవరించారు.

Published : 24 Mar 2023 04:09 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: భారత రాష్ట్రపతి నిలయం.. తలుచుకుంటేనే చూడాలనిపించే అందమైన భవనం. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది భవనాన్ని సందర్శకులు చూసేలా నిబంధనలను సవరించారు. ఆసక్తి కలిగిన వారు అంతర్జాలంలో ప్రత్యేక పుట ద్వారా దరఖాస్తు చేసుకొని స్లాట్‌ ఆధారంగా సందర్శించే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించిన వివరాలివి.

అంతర్జాలం ద్వారా అనుమతి..

సుమారు 70 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న నాటి వైస్రాయ్‌ నివాస భవనాన్ని నైజాం స్వాధీనం చేసుకున్నారు.  స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం 1950లో దీన్ని సుమారు రూ.60 లక్షలతో కొనుగోలు చేసి సొబగులు అద్ది భారత రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా మార్చారు. ఇక్కడ కొద్దిరోజుల పాటు బస చేసే వీలు కల్పించారు. అరుదైన పూల తోటలు సహా రాచరిక వ్యవస్థకు ప్రతిబింబంగా నిలిచిన ఈ భవనాన్ని.. అంతర్జాలం ద్వారా అనుమతి పొంది సందర్శించే వీలు కల్పించారు.

టికెట్ల ధరలు  

ఎనిమిదేళ్లలోపు వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం. సాధారణ పౌరులకు రూ.50, విదేశీయులకు రూ.250 టికెట్‌ ధరగా నిర్ణయించారు. ప్రతి సోమవారం సహా ప్రభుత్వ సెలవుదినాల్లో ప్రవేశాలకు అవకాశం లేదు. సోమవారం ప్రాంగణ నిర్వహణ కోసం సందర్శకులను అనుమతించరు.


అనుమతులు పొందేదెలా..

అంతర్జాలంలో https:///visitrashtrapatibhavan.gov.in చిరునామాలో శోధిస్తే ఉద్యాన్‌ ఉత్సవ్‌ పేరిట అంతర్జాల పుట కనిపిస్తుంది. అందులో సమగ్ర వివరాలున్నాయి. ఎలా అనుమతులు పొందాలన్నది కూడా సచిత్రంగా వివరించారు. గురువారం నుంచి సందర్శకులకు అనుమతిచ్చారు.


విశేషాలేమిటంటే?

రాష్ట్రపతి నిలయంలో మొత్తం తొమ్మిది రకాల విశేషాలను సందర్శకులు తిలకించవచ్చు. రెండు వందల ఏళ్ల వయసున్న శీషం వృక్షం, ఔషధ విలువలున్న మొక్కల తోట, వామన వృక్షాల (బోన్‌సాయి)తోట, మ్యూజికల్‌  ఫౌంటేన్‌, లాన్స్‌, ఫుడ్‌ కోర్టు, లాంగ్‌ గార్డెన్‌ తదితరాలు ఉన్నాయి.

అంతర్జాలంలో అనుమతుల దరఖాస్తు పుట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని