అన్నదాతలంటే కేసీఆర్‌కు ఆరో ప్రాణం
‘అన్నదాతలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరో ప్రాణం. ఒకసారి మంత్రి వర్గ సమావేశంలో రైతుబంధు డబ్బు చెల్లింపుపై చర్చ జరిగింది.
ప్రసంగిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్, పక్కన జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ త్రిపాఠి, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సర్పంచి సమ్మయ్య
గోవిందరావుపేట, న్యూస్‌టుడే: ‘అన్నదాతలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరో ప్రాణం. ఒకసారి మంత్రి వర్గ సమావేశంలో రైతుబంధు డబ్బు చెల్లింపుపై చర్చ జరిగింది. నిధులు ఇబ్బంది ఉంటే కాస్త ఆలస్యంగా చెల్లిద్దామని మంత్రులమైన మేమందరం అన్నాం. ఆ విషయంలో ఆయన వెంటనే స్పందించి అవసరమైతే మీ జీతాల్లో కోత విధిస్తాను. కానీ, నా గొంతులో ప్రాణం ఉండగా రైతు బంధు పథకాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఆ విధంగానే రైతుల సాగు సమయానికి రైతు బంధు నగదును వారి ఖాతాల్లో జమ చేస్తూ కేసీఆర్ తన పాలనతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నార’ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం వరకు కారులో వచ్చిన ఆమె అక్కడ రైతులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై ఇతర అధికారులతో కలిసి సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గోవిందరావుపేట మండలం చల్వాయిలో శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రైతు వేదికల నిర్మాణం ఎవరూ ఊహించలేదన్నారు. నిరంతర ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. అందరి సంక్షేమం గురించి ఆయన ఆలోచించడం వల్లే ఈ రోజు దేశం గర్వించదగ్గ పలు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. పది కాలాల పాటు ప్రజలకు సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ మన ముఖ్యమంత్రిని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు. చల్వాయి గ్రామ అభివృద్ధికి తన సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆమె గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు. జడ్పీ ఛైర్మన్ కె.జగదీశ్వర్, ఎంపీపీ ఎస్.శ్రీనివాసరెడ్డి, సర్పంచి ఇ.సమ్మయ్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం, డీఏవో గౌస్ హైదర్, డీహెచ్‌వో రమణ, డీఆర్‌డీవో నాగపద్మజ, తహసీల్దార్ ఎ.రాజ్‌కుమార్, ఎంపీడీవో జె.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.