logo

దారుణం.. అల్లుడిని చంపేసి.. సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేశారు!

గుట్టు చప్పుడు కాకుండా అల్లుడిని హతమార్చి సెప్టిక్‌ ట్యాంక్‌లో పూడ్చిన ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 09 Aug 2023 08:58 IST

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: గుట్టు చప్పుడు కాకుండా అల్లుడిని హతమార్చి సెప్టిక్‌ ట్యాంక్‌లో పూడ్చిన ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడానికి చెందిన చింత అబ్బసాయిలు-లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు శైలజను 20 ఏళ్ల కిందట తన సోదరి కుమారుడైన కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన రామిండ్ల నాగరాజు(45)తో వివాహం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి నలుగురు సంతానం కాగా.. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాగరాజు తరచూ మద్యం తాగి భార్యతో గొడవ పడటంతో.. ఆమె పలుమార్లు దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

సోమవారం రాత్రి 10 గంటలకు నాగరాజు మద్యం తాగి ఇంటికి వచ్చి తలుపులను గట్టిగా కొట్టాడు. తలుపులు తీసిన భార్యతో గొడవపడ్డారు. అతనికి నచ్చచెప్పి భార్య అన్నం తినిపించే ప్రయత్నం చేస్తుండగా ఆమె చేతి వేలును గట్టిగా కొరికాడు. రక్తస్రావం కావడంతో.. తన తండ్రి అబ్బసాయిలును పిలవగా ఆయన కోపంతో అల్లుడైన నాగరాజును చెంపపై కొట్టారు. ఆవేశంతో మామ మెడపై ఉన్న కండువాతో ఉరి బిగించగా, మామ అబ్బసాయిలు కూడా అల్లుడి మెడలోని కండువాతో అతనికి ఉరి బిగించగా నాగరాజు మృతిచెందాడు. భయాందోళనకు గురైన వారు అతడిని గుట్టు చప్పుడు కాకుండా సెప్టిక్‌ ట్యాంక్‌లో తలకిందులుగా వేసి పూడ్చి పెట్టారు. మంగళవారం యథావిధిగా కుటుంబ సభ్యులు ఎవరిపనులకు వారు వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయం జనగామలోని తన స్నేహితుడి ఇంటి నుంచి వచ్చిన మృతుడి పెద్ద కుమారుడు కిరణ్‌ ఇంట్లో పడివున్న తండ్రి దుస్తులను చూసి ఆరా తీయగా, అసలు విషయం బయటికి వచ్చింది. తండ్రిని పూడ్చిన పరిసరాల్లో ఉన్న మట్టిని గమనించి వెతికి చూడగా సెప్టిక్‌ ట్యాంకులో శవమై కనిపించాడు. దీంతో భయపడిన అబ్బసాయిలు గ్రామంలోని ఎంపీటీసీ సభ్యుడు జాకీర్‌కు సమాచారం అందించగా.. ఆయన స్థానిక సర్పంచి బిళ్ల అంజమ్మ యాదవరెడ్డికి వివరాలు తెలియజేశారు. పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్‌కు సమాచారం అందించడంతో..  సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంకు నుంచి బయటకుతీయగా, కాళ్లు చేతులు చీరతో కట్టిపడేసి ఉన్నాయి. మృతుడి తలపై బలమైన గాయమైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ అబ్బసాయిలు, భార్య శైలజ, చిన్న కుమారుడు తేజ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. గ్రామంలో ఎలాంటి ఘనటలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దేవరుప్పుల ఎస్సై శ్రవణ్‌, కొడకండ్ల ఎస్సై శ్రవణ్‌కుమార్‌, పాలకుర్తి ఎస్సై సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని