logo

హవాలా కేసులో ఇద్దరి అరెస్టు

వరంగల్‌ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 10 May 2024 02:01 IST

మట్టెవాడ, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. నాయుడు అనే వ్యక్తి వరంగల్‌ బ్యాంకు కాలనీకి చెందిన పత్తి వ్యాపారి పూర్ణచందర్‌కు వాట్సప్‌ ద్వారా ఫోన్‌ చేసి రూ.5 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే రూ.15 కోట్లు ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లిస్తామని నమ్మబలికాడు. అతడి గురించి పూర్తి సమాచారం తెలియక పోవడంతో నమ్మలేదు. ఈ విషయంలో కాశీబుగ్గకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఉప్పునూతల విష్ణు, శ్రీధర్‌లు పూర్ణచందర్‌ను ప్రోత్సహించారు. దీంతో 2022 డిసెంబరు 16న హైదరాబాద్‌లోని హవాలా ఏజెంట్ ద్వారా రూ.5 కోట్లను దిల్లీలో ఉన్న నాయుడుకు పంపించారు. ఆ తర్వాత పూర్ణచందర్‌కు రూ.15 కోట్లు ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) ద్వారా జమ అయినట్లు నకిలీ సందేశాన్ని పంపించాడు. ఇది నమ్మిన పూర్ణచందర్‌ బ్యాంకుకు వెళ్లి చూడగా.. ఎలాంటి నగదు జమ కాలేదు. దీంతో శ్రీధర్‌ను కలిసి నగదు ఇప్పించాలని కోరగా.. రూ.1.27 కోట్లను వసూలు చేసి పూర్ణచందర్‌కు ముట్టజెప్పారు. మిగతా నగదు ఇచ్చేలా చూడాలని పూర్ణచందర్‌ తన వద్ద ఉన్న రూ.53 లక్షలను విష్ణు, శ్రీధర్‌లకు అందించాడు. కొద్దిరోజుల తర్వాత శ్రీధర్‌ను డబ్బు విషయం అడగటంతో దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌ పేర్లతో బెదిరింపులకు దిగాడు. మోసపోయానని గమనించిన పూర్ణచందర్‌ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 30న ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విష్ణు, శ్రీధర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు ఓంనాయుడు, ప్రజాపతి, పటేల్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని