logo

కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!

కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్‌ ఆచార్యులు తాటికొండ రమేశ్‌ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది.

Updated : 10 May 2024 05:58 IST

పోటీలో 55 మంది.. పెరిగిన రాజకీయ జోక్యం

న్యూస్‌టుడే, కేయూ క్యాంపస్‌: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్‌ ఆచార్యులు తాటికొండ రమేశ్‌ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. 2021 మే 21న కేయూ 14వ ఉప కులపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని మరో పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు సైతం అప్పుడే నియమితులయ్యారు. వీరి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాల కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గత జనవరిలో  ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 20 వరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

భారీగా దరఖాస్తులు..

కేయూ వీసీ కోసం అర్హులైన ఆచార్యులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇతర విశ్వవిద్యాలయాలతో పాటు కేయూ విశ్రాంత, ప్రస్తుత ఆచార్యులు 55 మంది ఉన్నారు. గతంలో 10 నుంచి 15 మంది మాత్రమే పొటీపడేవారు.  వీసీ రేసులో అత్యధికంగా విశ్రాంత ఆచార్యులు ఉన్నారు. ఆచార్యుడిగా పదేళ్ల అనుభవం కలిగివారు అర్హులని.. ఎలాంటి వయో పరిమితి లేదని నిబంధనల్లో పేర్కొనడంతో పోటీ భారీగా పెరిగింది. ప్రసుత్తం సర్వీసులో ఉండి పదేళ్ల అనుభవం ఉన్నవారు కేయూలో నలుగురు మాత్రమే ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకున్నారు. కేయూలోని పలు విభాగాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఆచార్యులు 35 మంది ఉన్నారు. ఇతర విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి మరో ఆరుగురు పోటీపడుతున్నారు.

ముగ్గురు మాజీ ఉప కులపతులు కూడా..

ప్రస్తుత కేయూ ఉప కులపతి ఆచార్య టి.రమేశ్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులుగా పనిచేసిన మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి, ఆచార్య బి.వెంకటరత్నం, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసిన ఆచార్య ఎండీ.ఇక్బాల్‌అలీ, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసిన ఆచార్య ఖాజాఅల్తాఫ్‌ హుస్సేన్‌లు పోటీలో ఉన్నారు.

వివరాల సేకరణ..

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ ఈసీ అనుమతితో ఉప కులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు దరఖాస్తు చేసుకున్న పేర్లను నిఘా వర్గాలకు పంపించినట్లు తెలిసింది. త్వరలోనే సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారని తెలిసింది.

పైరవీలు షురూ..

ఉప కులపతి పదవి అకడమిక్‌కు సంబంధించినప్పటికీ నియామకంలో రాజకీయ ప్రమేయం కీలకంగా మారింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పదవి లభించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆశావహులు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని