logo

పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!

నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్‌), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు.

Published : 10 May 2024 02:17 IST

పనులు చేశాక వరంగల్‌ తుమ్మలకుంట నాలాలో నిలిచిన మురుగునీరు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్‌), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. పైన ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తీసేస్తున్నారు. పూడికతీత పనులపై గ్రేటర్‌ వరంగల్‌ ఇంజినీర్ల పర్యవేక్షణ కొరవడింది. ఇంజినీరింగ్‌, ప్రజారోగ్య విభాగాల క్షేత్రస్థాయి ఉద్యోగులు దగ్గరుండి పనులు చేయించాలని బల్దియా కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పనులు జరిగే ప్రాంతంలో కనిపించడం లేదు. కొందరు గుత్తేదారులు ఇష్టానుసారంగా పూడికతీత పనులు చేస్తున్నారని కొందరు కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగైతే గతేడాది మాదిరిగానే కాలనీలకు ముంపు సమస్య తప్పదని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో మొత్తం 29 నాలాల్లో పూడికతీత పనుల కోసం రూ.79.81 లక్షలు కేటాయించారు.

నామినేషన్‌పై పనుల కేటాయింపు

వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో నాలాల పూడికతీత పనులు టెండర్లు లేకుండా నామినేషన్‌పై కేటాయించారు. కొందరు ఇంజినీరింగ్‌ అధికారులు ఇష్టానుసారంగా పనులు అప్పగించారని తెలిసింది. ప్రతి సంవత్సరం పూడికతీత పనులు టెండర్లు నిర్వహించేవారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో నామినేషన్‌పై కేటాయించారు. అదే బహిరంగంగా టెండర్లు పిలిచి ఉంటే ఒక్కో పనికి 10శాతం పైనే తగ్గింపునకు అవకాశం ఉండేది. ఏఈలు ప్రతిపాదించిన నిధులతో నామినేషన్‌ కింద పనులు అప్పగించారు. గుత్తేదారులకు లబ్ధి చేకూరింది. కొందరు ఏఈలు ముందుగానే పర్సంటేజీలు వసూలు చేశారని తెలిసింది.

వ్యర్థాలను తీసుకెళ్తున్న కార్మికులు

మట్టిని ముట్టుకోవడం లేదు..

  • నిబంధనల ప్రకారం నాలాలో పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాల పూడిక తీయాలి. వరదనీరు సాఫీగా వెళ్లేలా పనులు పూర్తి చేయాలి.
  • వరంగల్‌ ప్రాంతంలో తుమ్మలకుంట, దేశాయిపేట, ఎల్బీనగర్‌, చింతల్‌, హంటర్‌రోడ్‌ బొందివాగు, పోతననగర్‌, నాలాల్లో జేసీబీ, హిటాచీ మిషన్లతో పూడికతీత పనులు చేపట్టారు. అవసరమున్న దగ్గర కార్మికులను రంగంలోకి దించారు. నాలాల్లో పేరుకుపోయిన మట్టిని మాత్రం ముట్టుకోవడం లేదు.
  • కాజీపేట రామకృష్ణ కాలనీ, హంటర్‌రోడ్‌ జూపార్కు, నందిహిల్స్‌, తిరుమల బార్‌, నయీంనగర్‌, కిషన్‌పురా, గుండ్లసింగారం తదితర నాలాల్లో పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని