logo
Published : 29 Jun 2022 04:27 IST

ఉన్నది ఇద్దరే తనిఖీ మొక్కుబడే

ఆహార విక్రయాలపై కొరవడిన నిఘా  

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే

ఏలూరు, భీమవరం, తణుకు, నరసాపురం తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పాలకొల్లు.. వంటి ఒక్కో పట్టణంలో రెండొందల నుంచి అయిదొందల వరకు ఆహార విక్రయ కేంద్రాలు(హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు) ఉన్నాయి. ఇతర చెప్పుకోదగ్గ ఒక్కో పట్టణంలోనూ వంద నుంచి 200 వరకు ఇవి కనిపిస్తాయి. కొన్ని గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నవి పదిశాతానికి మించదు. పొందిన కేంద్రాల్లోనూ రెన్యువల్‌ చేయించుకున్నవి సగానికి సగమే ఉంటాయి. పెద్ద హోటళ్లకు కూడా దీనిపై శ్రద్ధ లేదంటే ఆహార భద్రత.. జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

* ఏలూరు సత్రంపాడు సెంటర్‌లో కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు సాయంత్రం అయిదు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరాటంకంగా నడుస్తాయి. వందల మంది భోజనం చేస్తారు. మురుగు కాలువల పక్కన, నోరు తెరుచుకున్న బోదెల పైనా ఏర్పాటు చేసిన ఆ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల వద్ద పరిశుభ్రత, నాణ్యత.. కనుచూపు మేరలో కనిపించవు.  

* ఏలూరు బస్టాండు సెంటర్‌లో మూడు ఆహార విక్రయ వ్యాన్‌లు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టి ఉంటాయి. విక్రయాలు సైతం జోరుగా సాగుతుంటాయి. విక్రయానికి ఎలాంటి అనుమతులూ లేవు.

* తాడేపల్లిగూడెంలో పెద్దభోజన హోటళ్లు 18, చిన్నవి 22 ఉన్నాయి. ఇవి కాకుండా 19 కర్రీపాయింట్లు, దాబాహోటళ్లు  12ఉన్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఇతర ఫుడ్‌ అవుట్లెట్లు.. అన్నీ కలిపి కలిపి దాదాపు 200కు పైగా ఉంటాయి. వీటిలో లైసెన్సు పొందినవి పదహారే. గత తొమ్మిది నెలలుగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు లేవు. కనీసం పర్యవేక్షణ చేసిన దాఖలాలు కూడా లేవు.


2021-22 సంవత్సరానికి ఫుడ్‌ లైసెన్సుల సంఖ్య సుమారు 2,000

వసూలు చేసిన అపరాధ రుసుము సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు


ఇదీ పరిస్థితి

* ఉమ్మడి జిల్లాలో మొత్తం 45 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల అవసరముంది. ఉన్నది జిల్లాకొక్కరు చొప్పున ఇద్దరే. వీరితో తనిఖీలు నామమాత్రమే.

* ఏలూరు, భీమవరం వంటి ఒక్కో పట్టణంలోనే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌, బిర్యానీ సెంటర్లు.. ఇతర అన్ని రకాల ఆహార పదార్థాలను విక్రయించే ఫుడ్‌ అవుట్‌లెట్లు.. కలిపి రెండు వేలకు పైగా ఉంటాయి. అంటే మిగతా చోట్ల ఉన్నవన్నీ అనధికారిక ఆహార విక్రయ కేంద్రాలే.

* ఎవరైనా అనుమతులు లేకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని తెలిస్తే తొలుత నోటీసులిస్తారు. ఆ తరువాత సైతం అలాగే కొనసాగిస్తే రూ.అయిదు లక్షలు జరిమానాతోపాటు సదరు వ్యక్తులకు ఆరు నెలలు జైలు శిక్ష వేసే అవకాశముంది. కానీ 2021-22 సంవత్సరానికి నమోదు చేసిన కేసులు 25 మాత్రమే. దీంతో ఆహార భద్రత విభాగం పనితీరును అంచనా వేయొచ్చు.

చాలా ఆహార విక్రయ కేంద్రాలకు లైసెన్సులు లేవు. వీధి విక్రయ కేంద్రాల్లోనే కాదు. చాలా హోటళ్లలో ఎలాంటి నిబంధనలూ పాటించట్లేదు.  ఆయా మార్గదర్శకాలను పాటిస్తున్నామని పేర్కొంటూ దరఖాస్తు చేసుకుంటే అధికారులు తనిఖీ చేసి లైసెన్సు మంజూరు చేస్తారు. కానీ ఉభయ జిల్లాల్లో అసలు లైసెన్సుతో పనిలేకుండా.. వేల కొద్దీ ఆహార విక్రయ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేరు.

చాలా హోటళ్లలో అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. జాతీయరహదారి పక్కనే డ్రమ్ముకు పొయ్యిలు ఏర్పాటు చేసి వాటితోనే వండుతూ ఉంటారు. పక్కనే మురుగు పారుతుంటుంది. మరోవైపు ఆయా పదార్థాలను దుమ్ముధూళి మధ్యే బహిరంగంగా వండుతూ ఉంటారు. ప్టాస్టిక్‌ కవర్లలో వేడి వేడి కూరలు వేసి ఇస్తుంటారు.

ఉన్న సిబ్బందితోనే చేస్తున్నాం.. ‘ఉమ్మడి జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న అధికారులతోనే సాధ్యమైనంత మేర తనిఖీలు చేస్తున్నాం.  ఫుడ్‌లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు అంతా కలిపి 7 వేలకు పైగా ఇచ్చాం. ఆహార పదార్థాలు విక్రయించేవారు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts