logo

భవిత అంటేనే అలుసు

ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు మంజూరు చేయకపోవడంతో కనీస అవసరాలకు సమస్యలు తప్పడం లేదు. పిల్లలకు ఇచ్చే రవాణా ఛార్జీలు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలను రెండేళ్లుగా ఇవ్వడం లేదు.

Published : 24 Sep 2022 05:59 IST

అందని నిర్వహణ ఖర్చులు

ఉపకార వేతనాలు, రవాణా ఛార్జీల ఊసే లేదు

కైకలూరు,మండవల్లి, న్యూస్‌టుడే: ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు మంజూరు చేయకపోవడంతో కనీస అవసరాలకు సమస్యలు తప్పడం లేదు. పిల్లలకు ఇచ్చే రవాణా ఛార్జీలు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలను రెండేళ్లుగా ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల ప్రతి వారం సేవలందించే ఫిజియోథెరపిస్టులు సక్రమంగా రావడం లేదు.
నిధుల కొరత.. మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్తు ఛార్జీలు, మరుగుదొడ్ల నిర్వహణకు ఒక్కో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున కేటాయిస్తోంది. కరోనా అనంతరం రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో పాఠశాల నిర్వహణకు సిబ్బంది తమ సొంత నగదునే ఖర్చు చేసి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి విద్యార్థికి బస్సు లేదా ఆటో ఛార్జీలకు నెలకు రూ.250 చెల్లించాల్సి ఉండగా మూడేళ్లుగా వాటి ఊసే లేదు.

అంతంత మాత్రంగానే
దివ్యాంగుల శాఖ ద్వారా భవిత కేంద్రాల్లో చదివే ఒకటి నుంచి 8 వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.వెయ్యి, 8వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు రూ.1,200 చొప్పున ఉపకార వేతనాలు ఇస్తున్నారు. మూడేళ్లుగా వీటిని అందించడంలోనూ తీవ్ర జాప్యం నెలకొంది. ఇక ఎస్‌ఎస్‌ఏ నిధులతో అవసరమైన వారికి ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కంటి అద్దాలు ఉచితంగా అందించేవారు. ప్రస్తుతం ఇదీ అంతంతమాత్రంగానే జరుగుతోంది.
దివ్యాంగులైన చిన్నారులకు ఫిజియోథెరపీ సేవలందించడంతోపాటు వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను వీటిల్లో నియమించి బాలబాలికల్లో ఆసక్తి కలిగించేలా ప్రత్యేక ఉపకరణాల సాయంతో బోధన అందిస్తున్నారు. జన్యుపరమైన లోపాలు, పోలియో లక్షణాలున్న పిల్లలనూ వీటిల్లో చేర్చుకుంటారు.

ప్రతిపాదనలు పంపాం..  
భవిత కేంద్రాల నిర్వహణ నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కరోనా అనంతరం నిధుల కొరత ఏర్పడింది. కొన్ని కేంద్రాలకు మాత్రమే ఆటో ఛార్జీలు అందించాం. ఫిజియోథెరపిస్టులు అవసరం మేరకు ప్రతి మండలానికి వెళ్తున్నారు. ఉపకార వేతనాల అంశం దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో ఉంది.   -పి.శ్యామ్‌సుందర్‌, అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌, పశ్చిమగోదావరి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని