పోరాడదాం.. రాష్ట్రాన్ని కాపాడదాం
‘నేను సీఎంగా ఉన్నప్పుడు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ సైకో రెడ్డి వచ్చాక పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.
సైకో రెడ్డి వచ్చాక పెట్టుబడులు వెనక్కి
తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు
పోలవరంలో ప్రసంగిస్తూ...
ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణం, పోలవరం: ‘నేను సీఎంగా ఉన్నప్పుడు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ సైకో రెడ్డి వచ్చాక పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని’ తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడప్పుడు బటన్ నొక్కి ప్రజలకు డబ్బులేస్తూ.. ఆయన మాత్రం రోజూ తన ఖాతాల్లో నిల్వలు పెచుకుంటున్నారన్నారు. ప్రజలకు గోరంత ఇచ్చి.. కొండంత దోచుకుంటున్నారని.. ఇసుక, మద్యం, మైనింగ్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఆస్తులు పెంచుకుంటున్నారనే తప్ప.. ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. పోరాడదాం..రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.
కొయ్యలగూడెంలో సాగుతున్న రోడ్డుషో
పోటెత్తిన అభిమానం
పోలవరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో అభిమానం పోటెత్తింది. మహిళలు పెద్దసంఖ్యలో హారతులు ఇచ్చేందుకు గంటల కొద్దీ ఎదురుచూశారు. ఇదేం ఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమం రెండోరోజు పర్యటనలో గురువారం నరసన్నపాలెంలో బీసీల ఆత్మీయ సదస్సు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన చంద్రబాబు సీతంపేట మీదుగా బయ్యనగూడెం చేరుకున్నారు. అప్పటికే పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు చంద్రబాబు కోసం రోడ్డుకిరువైపులా బారులు దీరారు. పోలవరం ఏఎమ్‌సీ మాజీ ఛైర్మన్ పారేపల్లి రామారావు సారధ్యంలో అభిమానులు అందజేసిన బాణం, విల్లును చంద్రబాబు ఎక్కుపెట్టారు. స్థానికంగా ఉండే దివ్యాంగుడు చిక్కా మాధవ రావు చంద్రబాబును చూసేందుకు ఆయన కారుకు అడ్డంగా రావడంతో చంద్రబాబు వారించారు. కొయ్యలగూడెం చేరుకున్న చంద్రబాబు ప్రధానకూడలిలో ప్రచారరథం పై నుంచి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పనితీరుపై విరుచుకుపడ్డారు. అనంతరం దిప్పకాయలపాడు, కన్నాపురం గ్రామాల్లో జరిగినరోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. కన్నాపురంలో ఇద్దరు ఎంపీటీసీలను గెలిపించి పార్టీను రక్షించుకుంటున్నారని అభినందించారు. లక్ష్మీపురం, కొవ్వాడ, ఎల్‌ఎన్‌డీపేట, రేపల్లెవాడ, ప్రగడపల్లి మీదుగా సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా సాయంత్రం 5.50గంటలకు అభిమానుల కోలాహలం మధ్య పోలవరం ఏటిగట్టు సెంటరుకు చేరుకున్నారు. గిరిజనుల నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రాజెక్టుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేయడంతో చంద్రబాబు అక్కడే రోడ్డుపై అరగంట సేపు బైఠాయించారు. అనంతరం ప్రచారరథం పైకి చేరుకుని ప్రసంగించారు.ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ..
ఎన్టీఆర్, ఫులే చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు, చిత్రంలో పితాని, అంగర, సీతారామలక్ష్మి, కొల్లు రవీంద్ర తదితరులు
‘నేను అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తానని ప్రచారం చేస్తున్నారని.. నేను పథకాలు ఆపను.. సంపద సృష్టించి మరిన్ని పథకాలు అమలుచేస్తా’నని స్పష్టం చేశారు. ప్రశ్నించారని కేసులు పెడితే భయం వద్దు.. అండగా ఉంటానన్నారు. అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించేందుకు ప్రజలు భయపడేలా చేశారని, ఎవరైనా అడిగితే వారిపై పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తున్నారన్నారు. కొందరు పోలీసుల మెడపై కత్తిపెట్టి అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని, పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోకపోతే తరువాత బోను ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్‌రెడ్డి బాబాయిని హత్య చేస్తే.. గుండెపోటు నాటకం ఆడారు. తండ్రిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీతరెడ్డి ఒక్కరే పోరాడుతున్నారు. అది ఫలించడంతో కేసు తెలంగాణకు బదిలీ చేశారు. ఆ చర్యకు సిగ్గుపడి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ రఘురామకృష్ణ రాజును పోలీసులు కొట్టి ఆ వీడియో జగన్‌రెడ్డికి పంపిస్తే చూసి ఆనందించారు. ఇటువంటి సైకో ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటే.. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని దోచేస్తారన్నారు. మీ అందరిలో చైతన్యం రావాలి.. అందుకే నేను ‘ఇదేం ఖర్మ.. ఈ రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టి పర్యటిస్తున్నానని తెలిపారు. మీరంతా ప్రశ్నించడం ప్రారంభిస్తే మీకు అండగా నేనుండి పోరాడుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మొడియం శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ జడ్పీఛైర్మన్ బాపిరాజు, నియోజకవర్గ కన్వీనరు బొరగం శ్రీనివాస్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ; కొల్లు రవీంద్ర, పీతల సుజాత, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నరస్నపాలెంలో జరిగిన బీసీల సదస్సులో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు, నాయకులు
గోపాలపురం అభ్యర్థిగా వెంకటరాజు
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు పేరును చంద్రబాబు దొండపూడిలో ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావుకు ఏ విధంగా న్యాయం చేయాలో తనకు తెలుసని, ఎవరికీ అన్యాయం చేయనని స్పష్టం చేశారు. ఇక్కడ ఒకటే పార్టీ.. ఒకరే అభ్యర్థి అని పునరుద్ఘాటిస్తూ.. మీరంతా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అక్కడ క్రేన్ సాయంతో నాయకులు భారీ గజమాల వేసి చంద్రబాబుకు స్వాగతం పలికారు.
మద్యం అమ్మకాల్లో ఎందుకు ఆన్‌లైన్ చెల్లింపులు లేవు?
అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వేసి నాన్న బుడ్డీ పేరుతో జగన్ దోచుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పాత బ్రాండ్ మద్యం మార్కెట్లో లేకుండా చేసి కొత్త బ్రాండ్లతో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారన్నారు. తయారీ, టోకు వర్తకం, రిటైల్ అమ్మకాలు అన్నీ జగన్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, రోజూ లారీల్లో ఆ డబ్బు ఆయన ఇంటికి చేరుతోందని ఆరోపించారు. ప్రతి పాన్ షాపులోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఉన్నప్పుడు, మద్యం దుకాణాల్లో ఎందుకు అమలు చేయడం లేదని, అందులో ఉన్న చిదంబర రహస్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి జగన్ ఒక భస్మాసురుడిలా.. రాష్ట్రానికి పట్టిన శనిలా దాపురించారని.. అతనిని ఇంటికి పంపి.. వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు.
సోంబాబుకు పరామర్శ
బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుట్టాయగూడెం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన తెదేపా మండల అధ్యక్షుడు మొగపర్తి సోంబాబును చంద్రబాబు గురువారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరింత కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కొద్దిసేపు సోంబాబు కుటుంబీకులతో మాట్లాడారు.
ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి
బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: ఎన్టీ రామారావు వ్యక్తి కాదు, ఒక శక్తి, వ్యవస్థ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. జీలుగుమిల్లి మండలం పాలచర్ల రాజవరం, దర్భగూడెం గ్రామాల్లో ఆయన మాట్లాడారు. దర్భగూడెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను గుర్తుపెట్టుకునేంత మహోన్నత వ్యక్తి అని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి