logo

మనోవ్యధతో దంపతుల ఆత్మహత్య!

ఎవరికీ చెప్పుకోలేని మనోవ్యధ ఆ దంపతులను కుంగదీసింది. సంతోషంగా గడపాల్సిన శేష జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు.

Published : 21 Jan 2023 06:16 IST

కుమారుడు పక్కదారి పట్టడమే కారణమా?

కొవ్వూరు పట్టణం, ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఎవరికీ చెప్పుకోలేని మనోవ్యధ ఆ దంపతులను కుంగదీసింది. సంతోషంగా గడపాల్సిన శేష జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం హితకారిణి ధార్మిక భవనం సమీపంలో శుక్రవారం గోదావరిలో కనిపించిన భార్యాభర్తల మృతి అందరి మనసులను కలచివేసింది. పట్టణ పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు పంపుల చెరువు ప్రాంతానికి చెందిన కేదారి కొండలరావు(65) స్థానిక ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజరుగా పనిచేసి కరోనాకు ముందు ఉద్యోగ విరమణ చేశారు. భార్య ఉమామల్లేశ్వరి (59) గృహిణి. ఈనెల 19న మధ్యాహ్నం వారిద్దరూ బయటకు వచ్చారు. సాయంత్రానికి గోష్పాద క్షేత్రానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం గోదావరిలో మృతదేహాలుగా తేలారు. వీటిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొండలరావుకు సోదరుడి వరస అయిన వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐ రవికుమార్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

కొడుకు జల్సాల రాయుడు.. కొండలరావు కుటుంబం ఏలూరులో స్థిరపడ్డారు. నెలకు సుమారు రూ.70 వేల దాకా పింఛను వస్తోంది. కుమార్తె లీలా గాయత్రి భర్తతో కలసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఇంట్లో కూడా పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఇంజినీరింగ్‌ చదివిన కుమారుడు శ్రీకాంత్‌ జూదాలకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులకు కారణమయ్యారని తెలుస్తోంది. తమ్ముడి జీవితాన్ని సరిదిద్దేందుకు అక్క గాయత్రి సైతం అన్ని రకాలుగా సహకరించారు. ఎంత చెప్పినా కొడుకు వినకపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారని, ఆ బాధను బంధువులు ఎవరితోనూ పంచుకోలేదని సమాచారం. వీరి మృతికి ఇదే కారణమా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.

అతను ఎక్కడ ఉన్నాడో..!.. తల్లిదండ్రుల చనిపోయారన్న సమాచారం కుమారుడుకి తెలిసే మార్గం లేకపోయింది. వాళ్లు ఇంటి నుంచి వచ్చిన సమయంలో శ్రీకాంత్‌ ఎక్కడ ఉన్నాడో తెలియదు. అతని ఫోన్‌కు ప్రయత్నిస్తుంటే కలవట్లేదు. బంధువులు సైతం తమకు తెలియదని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని