logo

పెళ్లిళ్లు వందల్లో... నమోదు పదుల్లోనే

మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో యువతీయువకులు వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగు పెడతారు. పెళ్లి తంతును బంధుమిత్రుల సమక్షంలో సంబరంగా జరుపుకొంటారు.

Published : 27 Jan 2023 03:47 IST

ధ్రువీకరణ తప్పనిసరి అంటున్న అధికారులు
కొత్తగా ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం
ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో యువతీయువకులు వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగు పెడతారు. పెళ్లి తంతును బంధుమిత్రుల సమక్షంలో సంబరంగా జరుపుకొంటారు. ఆ జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటారు. కానీ, అంతే ప్రాధాన్యమున్న వివాహ ధ్రువీకరణపత్రాలు పొందే విషయంలో మాత్రం చాలామంది  నిర్లిప్తంగా ఉంటున్నారు. పెళ్లి జరిగిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు.

ఏలూరు నియోజకవర్గ పరిధిలో గత అయిదు నెలల్లో 500కు పైగా పెళ్లిళ్లు జరిగాయి. మార్చి నెలాఖరు నాటికి మరో 200 వరకు జరగవచ్చని పురోహితులు అంచనా వేస్తున్నారు.  చాలామంది రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ఆసక్తి చూపలేదు. నియోజకవర్గం(ఏలూరు నగరం)లో అక్టోబరు 59, నవంబరు 41, డిసెంబరులో 54 మంది చొప్పున వివాహ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు పొందారు. నగర పరిధిలోనే ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే వివాహాలను నమోదు చేయించుకోవాల్సి వచ్చేది.  ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయాల్లోనూ ఈ అవకాశం కల్పించింది. వివాహం చేసుకున్న నవ దంపతులు మూడు నెలల్లోపు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెలలోపు చేస్తే ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. నెల దాటితే రూ.100 చలానా కట్టాలి. మూడు నెలలు దాటితే సమీపంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో చేయించుకుంటే మేలు

‘ప్రస్తుతం వందల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నా  విదేశాలకు వెళ్లేవారు, లీగల్‌ అవసరాలున్నవారు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ప్రతి జంట వివాహ బంధాన్ని చట్టపరంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. భవిష్యత్తులో వీటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం అమలులోకి వచ్చిందని, స్లాట్‌ బుక్‌ చేసుకుంటే సంబంధిత తేదీ, సమయంలో వచ్చి ధ్రువపత్రాలు పొందవచ్చు’ అని ఏలూరు జాయింట్‌-1 సబ్‌ రిజిస్ట్రార్‌ అడ్డాల వెంకటేశ్వరరావు తెలిపారు.   

రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలు

విదేశాలకు వెళ్లే దంపతులకు పాస్‌ పోర్టు, వీసా, వర్క్‌ పర్మిట్‌, బీమా తదితర విషయాల్లో వివాహ ధ్రువపత్రం ఉపయోగపడుతుంది. ఈ పత్రం ఉంటే ఉద్యోగులు తమ భార్య లేదా భర్తను నామినీగా నమోదుచేయించుకోవడానికి వీలుంటుంది. భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎదురైతే కేసులు, కోర్టులో సాక్ష్యాల విషయంలో ఇది ఉపయోగపడుతుంది.  వివరాలతో నింపిన దరఖాస్తుతోపాటు దంపతులిద్దరి ఆధార్‌ నకళ్లు, జనన ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి మార్కులు జాబితాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, శుభలేఖ, తాళి కడుతున్న చిత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు