logo

తండ్రి పెదకర్మకు ట్రాక్టర్‌ తీసుకొస్తుండగా ప్రమాదం

తండ్రి పెదకర్మ నేపథ్యంలో భోజనాల ఏర్పాట్లకు అవసరమైన నీళ్ల ట్యాంకర్‌ కోసం ట్రాక్టర్‌ తీసుకొస్తుండగా మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 01 Feb 2023 05:18 IST

అన్న మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు

లింగపాలెం, న్యూస్‌టుడే: తండ్రి పెదకర్మ నేపథ్యంలో భోజనాల ఏర్పాట్లకు అవసరమైన నీళ్ల ట్యాంకర్‌ కోసం ట్రాక్టర్‌ తీసుకొస్తుండగా మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపాలెం పంచాయతీ పరిధి తిమ్మక్కపాలెం గ్రామానికి చెందిన కె.రాంబాబు(35), కె.సర్వేశ్వరరావు అన్నదమ్ములు. వీరి తండ్రి ఇటీవల చనిపోయారు. ఆయన పెదకర్మ బుధవారం నిర్వహించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భోజనాల కోసం నీళ్ల ట్యాంకర్‌ అవసరం కాగా.. దానికి సంబంధించి సర్వేశ్వరరావు డ్రైవర్‌గా పనిచేసే ట్రాక్టర్‌ను తోచలకరాయుడుపాలెం నుంచి తీసుకొస్తున్నారు. రాంబాబు వాహనం నడుపుతున్నారు. మార్గం మధ్యలో కొత్తపల్లి శివారు పెద్ద చెరువు వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి తిరగబడింది. ఆ సమయంలో సర్వేశ్వరరావు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ట్రాక్టర్‌ను పక్కకు జరిపి ఇద్దరిని బయటకు తీశారు. అయితే రాంబాబు అప్పటికే మృతిచెందగా సర్వేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. రాంబాబుకు భార్య, పాప, బాబు ఉన్నారు.


రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటనపై గ్రామీణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు..కోనసీమ జిల్లా ఐ.పోలవరం గ్రామానికి చెందిన రూపాకుల అనంత పద్మనాభశర్మ (36) కొన్ని రోజుల కిందట ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో జాతీయ రహదారి 216(ఏ) ఎల్‌.అగ్రహారం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్సై గోపీనాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.


నకిలీ నగలతో రుణం!
రూ.8 లక్షలు కాజేసిన సంస్థ ఉద్యోగులు

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: బంగారు నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులిచ్చే ఓ సంస్థలో నకిలీ నగలు పెట్టి ఆ సంస్థ ఉద్యోగులే డబ్బు తీసుకున్నారు. విషయం బయటపడటంతో ఏలూరు టూటౌన్‌ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని కాగుమట్టం ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు. సంస్థలో పని చేస్తున్న మేనేజర్‌ అవినాష్‌కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ తలిత, ఎగ్జిక్యూటివ్‌ శివకుమార్‌లు ఏకమై నకిలీ నగలు కొన్ని సంస్థలో తాకట్టు పెట్టి ఇటీవల రూ.8.58 లక్షల రుణం తీసుకున్నారు. ఈ విషయం బయటపడటంతో ఫైనాన్స్‌ సంస్థ హెడ్‌ కుమార్‌బాబు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోసానికి పాల్పడిన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని