logo

అనర్హులెవరో తేల్చకుండా తొలగింపా!

అనర్హులెవరో తేల్చకుండా ఇళ్ల స్థలాల జాబితాలో పేర్లు ఎలా తొలగిస్తారంటూ కలెక్టర్‌ పి.ప్రశాంతి రెవెన్యూ అధికారులను నిలదీశారు.

Updated : 02 Feb 2023 06:36 IST

అధికారులను నిలదీసిన కలెక్టర్‌

పెదపేటలో మహిళలతో మాట్లాడుతున్న ప్రశాంతి

కోలమూరు, పాములపర్రు, చెరుకువాడ (ఉండి), న్యూస్‌టుడే: అనర్హులెవరో తేల్చకుండా ఇళ్ల స్థలాల జాబితాలో పేర్లు ఎలా తొలగిస్తారంటూ కలెక్టర్‌ పి.ప్రశాంతి రెవెన్యూ అధికారులను నిలదీశారు. ఉండి మండలం పాములపర్రు, కోలమూరు గ్రామ సచివాలయాలను, ఉండి, చెరుకువాడల్లో లేఅవుట్లను ఆమె బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఉండి పెదపేట లేఅవుట్‌ ప్రాంతంలో కొందరు మహిళలు కలెక్టర్‌ను కలిసి తమకు స్థలాలు రాలేదని, చివరిలో పేర్లు తొలగించారని వివరించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ స్థానిక ఆర్‌ఐని ప్రశ్నించారు. స్థలాల కోసం వీరంతా గతంలోనే అర్జీలు ఇచ్చి ఉంటారు కదా అప్పుడేం తేల్చారని నిలదీశారు. వారు అప్పట్లో లేరని ఆర్‌ఐ ఆంజనేయులు చెప్పగా కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు ఎక్కడున్నారు.. గాల్లోనా.. మీకు గ్రామమే తెలియదా.. అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్‌ఐ, వీఆర్వోలు ప్రతి గృహాన్ని సందర్శించి ఆధార్‌, ఇతర వివరాల ఆధారంగా అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఉండి ఉన్నత పాఠశాలకు సమీపాన సేకరించిన స్థలంలో మట్టి పూడిక, రహదారుల పనులు చేపట్టాలన్నారు. అంతకు ముందు పాములపర్రు, కోలమూరు గ్రామ సచివాలయాలను తనిఖీలు చేసిన కలెక్టర్‌ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను తప్పనిసరిగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయాల్లో అర్జీల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. గృహ నిర్మాణ సంస్థ పీడీ అల్లూరి వెంకట రామరాజు, ఈఈ బి.వెంకటరమణ, డీఈ శివరామరాజు, తహశీల్దార్‌ ఎం.రవీంద్రకుమార్‌, ఎంపీడీవో అప్పారావు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని