logo

వేతనాలు అందక.. కష్టాలు తీరక

వైకాపా ప్రభుత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. ముఖ్యంగా జీతాల చెల్లింపు విధానంలో ప్రభుత్వ తీరు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

Published : 27 Mar 2024 04:13 IST

సమ్మె కాలానికి రూ.4.1 కోట్ల బకాయిలు

అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన(పాతచిత్రం)

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. ముఖ్యంగా జీతాల చెల్లింపు విధానంలో ప్రభుత్వ తీరు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు 42 రోజులకు పైగా కార్యకర్తలు, సహాయకులు సమ్మె చేసినా ఫలితం లేకపోయింది. అసలే అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి సమ్మె పోటు అప్పుల్లోకి నెట్టింది. సమ్మె కాలానికి వేతనం అందిస్తామని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా, ఎప్పటికి జమ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1556 అంగన్‌వాడీ కేంద్రాలు, 70 మినీ కేంద్రాలు ఉండగా కార్యకర్తలు 1556 మంది, సహాయకులు 1626 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.2.92 కోట్లు వేతనంగా చెల్లిస్తారు. సమ్మె కాలంలో 42 రోజులకు సుమారుగా రూ.4.1 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించేందుకు ఎన్నికల కోడ్‌కు ఒక్కరోజు ముందు జీవో విడుదల చేశారు. దీంతో కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు అవసరమైన ఆహారాన్ని అందించేందుకు కూరగాయలు, గ్యాస్‌, తదితరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనికితోడు కుటుంబపోషణ కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు.

ఆది నుంచీ అవస్థలే.. సిబ్బందికి ఆది నుంచీ అవస్థలే ఎదురవుతున్నాయి. నెలనెలా వేతనాలు అందుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా సమ్మె తర్వాత ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కువైందని సిబ్బంది వాపోతున్నారు. గతంలో  సెలవు అవసరమైతే సూపర్‌వైజర్లు మంజూరు చేసేవారు. సమ్మె అనంతరం సెలవుల మంజూరు కష్టంగా మారిందని, పనిభారం పెరగడంతోపాటు యాప్‌ల బాధ తప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయకులకు ఈ నెల వేతనంలో మూడు రోజుల జీతం మినహాయించి ఖాతాల్లో జమ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని