logo

పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!

డయాలసిస్‌ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు.

Updated : 28 Mar 2024 06:32 IST

పెరుగుతున్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు
డయాలసిస్‌ కేంద్రాల కొరత.. పట్టించుకోని ప్రభుత్వం

‘దశాబ్దాల పాటు పాలించిన పాలకులు కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. మేం అలా కాదు. మూత్రపిండ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం, వ్యాధి విస్తరణకు మూలాలు ఏమిటో కనుక్కొంటాం. సమూల నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. డయాలసిస్‌ కేంద్రాల పనితీరును మెరుగుపరుస్తాం. మూత్రపిండ సంబంధిత వ్యాధి బాధితులకు అండగా నిలుస్తాం.

డయాలసిస్‌ రోగులను ఉద్దేశించి గతంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది.


ఈనాడు డిజిటల్‌, భీమవరం, నరసాపురం, తణుకు గ్రామీణ న్యూస్‌టుడే: డయాలసిస్‌ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. భీమవరం 2, తణుకు 2, తాడేపల్లిగూడెం 1, ఏలూరు 4 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా రోజూ సుమారు 480 మందికి మాత్రమే డయాలసిస్‌ సేవలందుతున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ యంత్రాలను బట్టి ఇప్పటికే నిర్ణీత రోగుల సంఖ్య ఉండటంతో కొత్తగా వచ్చిన వారికి సేవలందడం లేదు. పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఉదాహరణకు భీమవరం ఆసుపత్రిలో 23 యంత్రాలుండగా, 15 మంది సిబ్బంది అయిదు షిఫ్ట్‌ల్లో 24 గంటలు పనిచేస్తున్నా గరిష్ఠంగా 65 మందికి మాత్రమే సేవలందుతున్నాయి. వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి రెండున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. సుమారు 180 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందుతుండగా, నిరీక్షణ జాబితాలో 45 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మిగిలిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉండటంతో రాజమహేంద్రవరం, విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వారు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
ఆర్థిక భారం.. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం డయాలసిస్‌ కేంద్రాలను పెంచకపోవడంపై రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు నుంచి నాలుగు సార్లు డయాలసిస్‌ చేయించాలి. ఒక్కసారికి కనీసం రూ.8వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చవుతుంది. ఒక ఇంజెక్షన్‌ ఖరీదు రూ.2వేల వరకు ఉంటుంది. పైగా ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా మరింత భారమవుతోందని బాధితులు వాపోతున్నారు.

  • రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నా. వ్యవసాయ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నేను ప్రైవేటుగా డయాలసిస్‌ చేయించుకోలేను. ఆరోగ్యశ్రీలో చేయించుకుందామని ఆసుపత్రికి వెళ్తే స్లాట్‌ ఖాళీ లేదని చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకునేందుకు వేల రూపాయలు ఖర్చువుతున్నాయని భీమవరానికి చెందిన వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు.
  • ఆరేళ్ల క్రితం మా అమ్మ అనారోగ్యానికి గురైంది. ఉన్నట్టుండి కాళ్లు వాపులు రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించగా మూత్రపిండాలు చెడిపోయినట్లు తేలింది. మొదట్లో మందులు వాడినా తగ్గకపోవడంతో డయాలసిస్‌ చేయించుకోవాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో వారానికి రెండు సార్లు భీమవరం వెళ్లి డయాలసిస్‌ చేయించే వాడినని, ఆర్థికంగా చితికిపోయామని నరసాపురానికి చెందిన లక్ష్మి కుమారులు వాపోయారు.

ప్రభుత్వ తిరకాసు.. ఆరోగ్యశ్రీలో డయాలసిస్‌ చేయించుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం పింఛను ఇస్తుంది. అత్యవసరమై ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారికి పింఛను అందడం లేదని, నిబంధనల్లో తిరకాసుతో రోగుల్లో కొందరికే రూ.10వేల పింఛను అందుతోందని కొంతమంది వాపోతున్నారు.


ప్రతిపాదనలకే పరిమితం.. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. సామాజిక బాధ్యతలో భాగంగా ఓఎన్జీసీ గతంలో వైద్యశాఖకు రూ.15 లక్షలు అందజేసింది. అవి ఖాతాలో మూలుగుతున్నాయి. నరసాపురం నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలోనూ బాధితులున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ సేవలందుతున్నా ఆరోగ్యశ్రీ అమలులో లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని