logo

అడుగడుగునా ఆంక్షలు..!

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉండి, భీమవరం నియోజకవర్గాల పరిధిలో గంటల తరబడి ఆలస్యంగా సాగింది.

Published : 17 Apr 2024 06:02 IST

భీమవరం: అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆర్‌యూబీ మూసివేత

ఉండి, భీమవరం అర్బన్‌, వీరవాసరం, పాలకోడేరు, ఆకివీడు, న్యూస్‌టుడే: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉండి, భీమవరం నియోజకవర్గాల పరిధిలో గంటల తరబడి ఆలస్యంగా సాగింది. పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉండి పరిధిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అవరోధాలు ఎదురయ్యాయి. బస్సు యాత్రకు ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు యువకులు మద్యం మత్తులో హారన్లు మోగిస్తూ హడావుడి చేశారు. ఉండిలో ప్రైవేటు పాఠశాలలను ఉదయం 11 గంటలకే మూసేసి విద్యార్థులను ఇళ్లకు పంపారు. తర్వాత ఆ బస్సులను భీమవరంలో బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు ఉపయోగించారు.

భీమవరం బైపాస్‌ రోడ్డులో సభ జరగడంతో భీమవరం-తాడేపల్లిగూడెం మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రకాశంచౌక్‌, అంబేడ్కర్‌, బీవీరాజు, ఆర్టీసీ బస్టాండ్‌ కూడళ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆర్‌యూబీని పోలీసులు మూసివేయడంతో అటుగా వెళ్లాల్సిన వారు గంటన్నర పాటు ఇక్కట్లు అనుభవించారు.

ఉండిలో కొందరు యువకులు ఓ సైకిల్‌ను నేలకోసి కొడుతూ నినాదాలు చేశారు.

విద్యార్థులకు అగ్ని పరీక్ష!

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలో మంగళవారం జరిగిన లా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ట్రాఫిక్‌ చిక్కులతో అవస్థలు పడ్డారు. సమయానికి వెళ్తామో లేదోననే ఆందోళనతో కొందరు ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు వెళ్లారు. భీమవరంలో జరిగిన జగన్‌ సభకు పశ్చిమగోదావరితో ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సులు కేటాయించారు. బస్సులన్నీ ఒకేసారి పట్టణంలోకి ప్రవేశించడంతో ప్రకాశంచౌక్‌,  చిన్నవంతెన, అంబేడ్కర్‌ కూడలి, పీపీరోడ్డు, మావుళ్లమ్మగుడి వీధి, తాలూకాఫీసురోడ్డు, బుధవారం మార్కెట్‌ కూడలి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ః సీఎం పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు గుర్తింపు పాస్‌లు ఇచ్చారు. ఇంతలోనే సీఎం భద్రతా విభాగం పేరిట కొందరికి ఫోన్‌ చేసి వాటిని వెనక్కి ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని