logo

కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా

విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్‌లో అల్లూరి శరత్‌చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది.

Published : 24 Apr 2024 04:02 IST

పోలీసుల అదుపులో నిందితుడు

నిందితుడు అల్లూరి శరత్‌చంద్రవర్మ

పెనమలూరు, న్యూస్‌టుడే: విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్‌లో అల్లూరి శరత్‌చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. శ్రీనివాసరెడ్డి ఆర్థికస్థితిని గమనించిన శరత్‌చంద్రవర్మ, అతడి భార్య జ్యోత్స్నప్రియలు పరిచయం పెంచుకొని వారికి మరింత దగ్గరయ్యారు. తక్కువ ధరకు తన కియా కారు, నున్న సమీపంలోని ఎకరా పొలాన్ని విక్రయిస్తానంటూ శ్రీనివాసరెడ్డి నుంచి తండ్రి వెంకట సంజీవరాజుతో కలిసి శరత్‌చంద్రవర్మ, జ్యోత్స్నప్రియలు రూ.92 లక్షలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన శ్రీనివాసరెడ్డి ప్రశ్నించే సమయంలో జ్యోత్స్నప్రియ అమెరికా పారిపోగా.. శరత్‌చంద్రవర్మ, తండ్రి సంజీవరాజులు పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడు శరత్‌చంద్రవర్మను మంగళవారం తాడిగడప వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి నేరస్థులతో తస్మాత్‌ జాగ్రత్త: సీఐ

పశ్చిమగోదావరి జిల్లా ఉండి ప్రాంతం నుంచి 1990లో అల్లూరి శరత్‌చంద్రవర్మ కుటుంబం విజయవాడ వచ్చి స్థిరపడిందని సీఐ టీవీవీ రామారావు తెలిపారు. గతంలో పెనమలూరుకు చెందిన తేలప్రోలు శ్రీనివాస్‌ సహా పలువురి నుంచి తక్కువ ధరకు కార్లు, స్థలాల పేరుతో మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అతడిపై పలు పాత కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాహనాల మీద హైకోర్టు జడ్జి, ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ శరత్‌చంద్రవర్మ కుటుంబ సభ్యులతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఇలాంటి నేరస్థులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని