logo

హామీలపై జగన్‌ పార్టీని నిలదీయండి

రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్‌రెడ్డి  భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 04:12 IST

రఘురామ

మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు, పక్కన ఎమ్మెల్యే రామరాజు

పాలకోడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్‌రెడ్డి  భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పాలకోడేరు మండలం కొండేపూడిలో ఆయన మంగళవారం కుటుంబ సమేతంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత రామాలయం, విఘ్నేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే వైకాపా ఓటమి అంచున ఉందని తెలిపారు. ఓటమిని తట్టుకోలేక జగన్‌ పారిపోయే రీతిలో కూటమి అభ్యర్థుల గెలుపు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యనిషేధం, ఇతర అంశాలపై హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్‌ పార్టీని మహిళలు నిలదీయాలని కోరారు. ఎంపీ కుమారుడు భరత్‌, భార్య రమాదేవి, ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

అన్నన్నా.. ఇంత మోసమా!

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలో ఇటీవల జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ సభకు జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు ఎన్నో అవస్థలు పడ్డారు. గంటన్నర పాటు కూర్చొంటే సరిపోతుంది.. రూ.500 ఇస్తామంటూ మభ్యపెట్టి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి జనాల్ని బస్సుల్లో తీసుకొచ్చారు. చివరికి వారు ఇస్తామన్న రూ. 500 ఇవ్వలేదని ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో చాలా మంది బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.300తో సరిపెట్టారని, మిగిలిన సొమ్ము మధ్యవర్తులు తినేశారంటూ తిట్లు దండకం మొదలెట్టారు. భీమవరంలో రెండు ప్రాంతాల్లోని నాయకులు రూ.200 చొప్పున ఇచ్చి సరిపెట్టడంతో స్థానికులు కోపోద్రిక్తులవుతున్నారు. రెండు వార్డుల్లో నాయకులైతే టోకెన్లు తీసుకువస్తే సొమ్ము ఇస్తామన్నారు. వాటి వెనుక పేరు, చరవాణి నంబరు వేసి మరీ తీసుకెళ్లినా చెల్లింపుల్లో భారీగా కోత విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు