logo

జగన్‌ దగాఖానా!

గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు.   సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్‌..

Published : 25 Apr 2024 06:39 IST

అన్నీ ఆర్భాటపు ప్రకటనలే 
ప్రభుత్వాసుపత్రుల్లో మొక్కుబడి సేవలు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, న్యూస్‌టుడే బృందం: ‘ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా... ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా... ప్రజలకు మల్టీస్పెషాలిటీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తా’ -ఇవి పాదయాత్ర సమయంలో జగన్‌ పలికిన ప్రగల్భాలు.


ద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు.   సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్‌... అధికారంలోకి వచ్చాక కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుకు చర్యలు తీసుకోలేదు. లక్షల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించామని చెబుతున్నా రోగుల వేదనను ఆయన పట్టించుకోవడం లేదు.జిల్లాలోని ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులు పడుతున్న ఇబ్బందులే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.


ముద్ర వేయడం కోసం వేచిచూస్తున్న గర్భిణులు

నరసాపురం ఆసుపత్రికి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో గర్భిణులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నా.. నరసాపురం  ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు లేరు. ఒక్కరే  ఉన్నారు.


భోజన సరఫరా లేదు

జ్వరంతో ఇబ్బంది పడుతూ నాలుగు రోజుల కిందట నరసాపురం ఆసుపత్రిలో చేరా. ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోవడంతో భోజనం సరఫరా చేయడంలేదు. ఇంటి నుంచి తీసుకొస్తున్నారు.

సుశీల, రుస్తుంబాద పెనుగొండ


పెనుగొండ

ఇక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో దంత వైద్య విభాగానికి చెందిన యంత్రం ఆరు నెలలుగా పనిచేయడం లేదు. రూట్‌కెనాల్‌, దంతాల శుభ్రత తదితర 8 రకాల సేవలు అందించాల్సిన ఈ యంత్రం ఉండి ఉపయోగం లేకపోయింది.  దీంతో వైద్యుడు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులు ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. సీహెచ్‌సీకి నూతన భవనం నిర్మించి, ప్రారంభించినా వినియోగంలోకి తీసుకురాలేదు. పాత భవనంలోనే రోగులకు అసౌకర్యాలు తప్పడం లేదు.

ప్రైవేటు కేంద్రంలో స్కానింగ్‌

నరసాపురం ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయకపోవడంతో ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు స్కానింగ్‌ చేయించుకున్నా. దీనికి రూ.6,400 వ్యయమైంది.   

అజీమున్నీషా, గర్భిణి, నరసాపురం


ఆచంట

  • ప్రధాన వైద్యుడు(ఎండీ) లేకుండానే 30 పడకల సీహెచ్‌సీ నడుస్తోంది. కంటి వైద్యులు లేరు. దంత వైద్యులు ప్రసూతి సెలవులో ఉండగా మత్తు డాక్టరు రావడం లేదు. అల్ట్రాసౌండ్‌, థైరాయిడ్‌, లిక్విడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు అందుబాటులో లేవు.  

రోగులంటే ఇంత నిర్లక్ష్యమా..

వ్యవసాయ పనులు చేస్తుండగా పార తెగి కాలుకి గాయమైంది. కట్టుకట్టించుదామని ఆకివీడు ఆస్పత్రికి వెళ్తే సిబ్బంది ఒకరు చాలా నిర్లక్ష్యంగా దురుసుగా మాట్లాడారు. ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో అని అరిచారు. మూడు గంటలు పడిగాపులు పడ్డ అనంతరం కట్టు కట్టారు. రోగులంటే ఇంత నిర్లక్ష్యమా..  సిబ్బంది ఇలా ప్రవర్తించడంతో ప్రైవేటు ఆసుపత్రికి ప్రజలు వెళ్లాల్సి వస్తోంది.  

మోటుపల్లి కోటేశ్వరరావు, ఆకివీడు      


భీమవరం

ప్రాంతీయ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం గర్భిణికి శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. ఉమ్మనీటి సమస్యతో వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శిశు సేవలు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో, రోజుకు సుమారు రూ.6వేల నుంచి 9వేల వరకు ఖర్చవుతున్నాయని బంధువులు వాపోతున్నారు. బాలింత(తల్లి)ని బుధవారం డిశ్చార్జ్‌ చేయగా వార్డు నుంచి బయటకు వచ్చేందుకు వీల్‌ఛైర్‌ లేకపోవడంతో నడిచి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది.


ఆకివీడు

సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ 70 నుంచి 80 మంది వస్తున్నా ఇక్కడ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగుల సహాయకులు వాపోతున్నారు. సరైన సమాధానం ఇవ్వకపోగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని   అంటున్నారు.

తాడేపల్లిగూడెం

ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందుబాటులో లేవు. ఆర్థోపెడిక్‌ వైద్యుడు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందడం లేదు. ట్రామాకేర్‌, స్కానింగ్‌ యంత్ర పరికరాలు అందుబాటు లేకపోవడంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. విషమ పరిస్థితిలో ఉన్నా సరే మెరుగైన వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

నరసాపురం :

ప్రాంతీయ ఆసుపత్రిలో ఇద్దరు సివిల్‌ సర్జన్లు అవసరం కాగా..ఒక్కరే ఉన్నారు. దంత వైద్యులు, రేడియాలజిస్ట్‌ లేరు. స్కానింగ్‌ యంత్రాలు ఉన్నా   సిబ్బంది లేకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వెంటిలేటర్లు ఉన్నా థియేటర్లు, సిబ్బంది లేరు. రోజూ కనీసం 150 ఓపీ ఉంటున్నా, ఆ మేరకు సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు.


జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవాలోపం కనిపిస్తోంది.  పరికరాలు,  ఆపరేషన్‌ థియేటర్లు ఉన్న చోట వైద్యులు లేరు. ఒకవేళ ఉన్నా కనీస సౌకర్యాలు లేవు.  రోగుల పట్ల సిబ్బంది తీరుపై కూడా ఫిర్యాదులుంటున్నాయి.  రోగ  నిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వంపై అంతర్గత పరిశీలన కొరవడిందని రోగుల సహాయకులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని