logo

పేదల బియ్యం పెద్దలకు పరమాన్నం!

పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వాలు రాయితీపై ఇస్తున్న బియ్యం నేతలకు పరమాన్నంగా మారుతోంది. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో నేతల కనుసన్నల్లో బియ్యం అక్రమ రవాణా ముఠాలు తమ  కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

Published : 21 Jan 2023 04:39 IST

చౌక దుకాణాల నుంచి తరలింపు
ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనూ అక్రమాలు
ప్రొద్దుటూరు, బద్వేలు కేంద్రాలుగా  అక్రమ రవాణా ముఠాలు

బద్వేలులో ఇటీవల  విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడిన బియ్యం

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, బద్వేలు: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వాలు రాయితీపై ఇస్తున్న బియ్యం నేతలకు పరమాన్నంగా మారుతోంది. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో నేతల కనుసన్నల్లో బియ్యం అక్రమ రవాణా ముఠాలు తమ  కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పట్టుబడుతున్న బియ్యం పరిమాణం చూస్తుంటే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, చౌక ధరల దుకాణాల నుంచే తరలిపోతున్నట్లుగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. చివరకు ప్రభుత్వ సంచుల్లోనే వ్యాపారులకు చేరవేస్తున్నారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. రాయితీ బియ్యాన్ని పాలిష్‌ పట్టి పక్క రాష్ట్రాలకు తరలించి ఏటా రూ.కోట్లల్లో వ్యాపారం సాగిస్తున్నారు. కొంత మంది ప్రజాప్రతినిధుల అండ... కొందరు పోలీసుల సహకారంతో యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు కేంద్రాలుగా విచ్చలవిడిగా పేదల బియ్యం అక్రమ ఎగుమతులు జరుగుతున్నాయి. బద్వేలులో శుక్రవారం లారీ బియ్యం పట్టుబడింది. ఇటీవల అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎంఎల్‌ఎస్‌ పాయింటు నుంచి రూ.4.60 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసిందే.

బద్వేలులో శుక్రవారం పట్టుబడిన బియ్యం లారీ

* పేదల బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు యథేచ్చగా రవాణా చేస్తూ ప్రతి నెలా రూ.లక్షలు అర్జిస్తున్నారు. కొన్ని చోట్ల దందా బహిరంగంగా సాగిస్తున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెట్టడంతో చౌక బియ్యం మాఫియా మరింత రెచ్చిపోతోంది. ఆ ముఠాలకు అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల మద్దతు ఉండడంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎవరికీ అనుమానం రాకుండా వాహనాల ద్వారా బియ్యం తరలిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణ కేంద్రంగా అక్రమార్కులు దందా నడుపుతున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రాజంపేట తదితర ప్రాంతాల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో గిడ్డంగి వీధి, రామేశ్వరం, మిట్టమడి వీధి, సూపర్‌బజార్‌రోడ్డుకు చెందిన వ్యక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రొద్దుటూరులో రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఈ కేంద్రాన్ని ముఠా వ్యక్తులు ఎంపిక చేసుకున్నారు. ఇలా సేకరించిన చౌక బియ్యాన్ని గతంలో రైస్‌ మిల్లులకు తరలిస్తుండగా... ఇప్పుడు అక్రమార్కులు స్థానికంగానే నూకగా తయారు చేసేందుకు యంత్రాలను నడుపుతున్నారు. ఒక్క ప్రొద్దుటూరులోనే దాదాపు 50 వరకూ యంత్రాలు నడుస్తున్నాయి. రామేశ్వరం, మోడంపల్లి, మండీ బజార్‌ వీధి, ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో యంత్రాలు ద్వారా బియ్యాన్ని నూకగా మారుస్తున్నారు.


బద్వేలు నుంచి ఇతర రాష్ట్రాలకు...

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు పట్టణం అడ్డాగా మారింది. ఇది వరకు ఒకరిద్దరు అక్రమ రవాణా చేస్తుండగా.. ఇప్పుడు వీధికొక్కరు తయారయ్యారు. అనేక పర్యాయాయాలు వీరిపై కేసులను నమోదైనప్పటికీ బెయిల్‌పై వచ్చి మళ్లీ ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తమ జోలికి ఎవరూ రాకుండా రాజకీయ పైరవీలుతో పాటు కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులకు నెలవారీ మామూళ్లను ముట్టచెప్పి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి పెద్ద లారీలతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జాతీయ రహదారుల్లో తనిఖీ కేంద్రాలున్నా.. మాముళ్లు ముట్టజెప్పి   తరలిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ రేషన్‌ బియ్యం పట్టుబడిన ఎక్కువగా బద్వేలు నుంచి రవాణా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. బద్వేలులో గతంలో పట్టుబడిన బియ్యం గోదాముల్లో ఇప్పటికీ¨ మగ్గిపోయి పనికిరాకుండా పోతున్నాయి. రేషన్‌ బియ్యం కోసమే కొన్ని రైసు మిల్లులు వెలిశాయంటే ఇక్కడ అక్రమ వ్యాపారం ఏపాటిదో చెప్పకనే తెలుస్తోంది. ఇటీవల అనేక పర్యాయాలు విజిలెన్స్‌ అధికారులు బద్వేలులో తనిఖీలు నిర్వహించి రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. తాజాగా చెన్నంపల్లెలో శుక్రవారం అక్రమంగా రేషన్‌ బియ్యం లారీకి నింపుతుండగా.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బద్వేలు ఆర్డీవో ఆకుల వెంకటరమణ స్వయంగా వెళ్లి 620 బస్తాల రేషన్‌ బియ్యం బస్తాలున్న లారీతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

Read latest Ysr News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని