logo

జగనన్నా... మాపై ఎందుకీ వివక్ష?

కన్నతల్లి లాంటి పల్లెతో ఉన్న అనుబంధం తెగిపోయింది. పంట పొలాలను ముంపు ముంచేసింది. పేదల బతుకు చిత్రం తారుమారైంది. జీవన ‘నావ’కు భరోసా కరవైంది. ఏళ్ల తరబడి ఎదురుచూసినా నిర్వాసితులకు నిర్వేదం మిగిలింది.

Published : 17 Apr 2024 05:58 IST

ఇంటి స్థలాలకు ఏళ్లతరబడి నిరీక్షణ
కుడమలూరు గ్రామస్థుల ఆవేదన
న్యూస్‌టుడే, కడప

ఓటు హక్కు ఉన్నా పునరావాసం కల్పించలేదని ముంపు బాధితుల నిరసన (పాత చిత్రం)

కన్నతల్లి లాంటి పల్లెతో ఉన్న అనుబంధం తెగిపోయింది. పంట పొలాలను ముంపు ముంచేసింది. పేదల బతుకు చిత్రం తారుమారైంది. జీవన ‘నావ’కు భరోసా కరవైంది. ఏళ్ల తరబడి ఎదురుచూసినా నిర్వాసితులకు నిర్వేదం మిగిలింది. పునరావాసం కలగా మారింది. ఇంటి స్థలాలకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. మౌలిక వసతుల ఊసేలేదు. అభివృద్ధి మాటే వినిపించడం లేదు. జగనన్నా ఇంకెన్నాళ్లీ దయనీయ బతుకులు, మాపై ఎందుకీ వివక్ష అంటూ కుడమలూరు నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఒంటిమిట్ట మండలం కుడమలూరులో 132 కుటుంబాలుండగా, 415 మంది ఉన్నారు. పురుషులు 126, మహిళలు 111 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ. సోమశిల వెనుక జలాల్లో చేపల వేటపై 80 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. సోమశిల వెనుక జలాలతో రెండు దశాబ్దాల కిందట గ్రామం ముంపులో చేరింది. వెనుక జలాలు రాని ఎత్తు ప్రదేశంలో పెంకు, రేకుల ఇళ్లల్లో దుర్భరజీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం చేపలవేట సాగకపోవడంతో గొర్రెలు, మేకలు, పశువుల పోషణ, కూలి పనులు చేసుకుంటూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. గ్రామానికి ఇప్పటికీ మట్టి దారే దిక్కు. రవాణా వసతి లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం బయటకు వెళ్లాలంటే ఆటోలు, ద్విచక్ర వాహనాలే ఆధారం. దాతలు నిర్మించిన రేకుల షెడ్డులోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. ఇక్కడ ప్రజలకు ఇప్పటికీ పక్కాగృహాలు మంజూరు చేయలేదు. తాగునీటి ట్యాంకులు నిర్మించలేదు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛను తీసుకోవాలంటే లబ్ధిదారులు ఏడు కిలోమీటర్ల దూరంలోని రాచగుడిపల్లె గ్రామ సచివాలయానికి వెళ్లాల్సిందే. గ్రామానికి ఎగువన సర్వే సంఖ్య 401లో 1,207.68 ప్రభుత్వ భూమిని సబ్‌ డివిజన్‌ (విభజన) చేశారు. సర్వే సంఖ్య 411లోని  12.26 ఎకరాలను ముంపు వాసుల పునరావాస కాలనీ ఏర్పాటు కోసం ఇస్తామని మూడేళ్ల కిందట రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఇంటి స్థలం వస్తుందని బాధితులు సంతోషించారు. ఊర్లో వారంతా రూ.3 లక్షలు చందాలు వేసుకొని కంప చెట్లు, ముళ్ల పొదలను తొలగించి చదును చేయించుకున్నారు. త్వరలో ఇంటి నివేశన పత్రాలను పంపిణీ చేస్తామని అధికారులు ఊరించారు. మండల, డివిజన్‌, జిల్లా అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అదిగో పట్టా ఇస్తాం.. ఇదిగో స్థలం తీసుకోండంటూ దాటవేస్తూ వస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం మా సొంతింటి కలను నెరవేర్చడంలేదని, మత్స్యకారులపై ఎందుకీ వివక్ష అంటూ వారంతా ప్రశ్నిస్తున్నారు. జాలర్లకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వడంలేదని వారంతా వాపోతున్నారు. గతంలో కోటపాడు కనుమ వద్ద ప్రభుత్వ భూమి సర్వే సంఖ్య 613లో పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని అధికార పార్టీ నాయకులు మాటిచ్చారని, ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు.


ఎదురుచూపులే

మిగిలాయి : సోమశిల వెనుక జలాలతో మా గ్రామం ముంపునకు గురైంది. గ్రామసమీపంలోని ప్రభుత్వ భూమిలో పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తామని మూడేళ్ల కిందట అధికారులు మాటిచ్చి ఇంతవరకు పట్టాలివ్వలేదు. పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదు. గ్రామాభివృద్ధిపై శీతకన్ను వేయడం అన్యాయం.

గుడి వెంకటరమణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని