logo

మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం

సీఎం జగన్‌... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు.

Updated : 18 Apr 2024 07:58 IST

అమ్మఒడి  అమలులో జగన్‌ మార్కు దగా
ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికే లబ్ధి
అధికారంలోకి వచ్చాక సీఎం నాలుక మడత
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప

సీఎం జగన్‌... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. ఆయన మాటలకు వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతనే ఉండదు. పిల్లలను బడికి పంపిస్తే తల్లులకు అందించే అమ్మఒడి సాయానికి రకరకాల సాకులతో కోతలు విధిస్తున్నారు. లబ్ధిదారులతోపాటు వారికిచ్చే మొత్తాన్ని తగ్గించేశారు. ఇలా అమ్మఒడి పథకంలోనూ జగన్‌ మార్కు మోసం చేశారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారికిద్దరికీ రూ.15 వేల చొప్పున ఇస్తానంటూ హామీనిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. ఎంతమంది పిల్లల్ని బడికి పంపినా ఒక్కరికే ఇస్తానంటూ మెలిక పెట్టారు. పోనీ వారికైనా సక్రమంగా ఇచ్చారా అంటూ అదీ లేదు. 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం దాటితే అనర్హులుగా తేల్చారు. అడ్డగోలు నిబంధనలతో అమ్మఒడి పథకంలో  అక్కచెల్లెమ్మలకు గుండెకోత మిగిల్చారు.

పేదరికమే కొలమానంగా తీసుకుని ఎక్కువ మందికి లబ్ధి చేకూరే   విధంగా చేస్తున్నామంటూ వైకాపా సర్కారు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనమే అమ్మఒడి పథకం. 2019లో అధికారం చేపట్టిన అనంతరం 2020లో తొలిసారిగా రూ.15 వేలు ఇవ్వగా, మరుసటి ఏడాది రూ.వెయ్యి కోత వేశారు. 2022 నుంచి పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో కోతను రూ.2 వేలకు పెంచారు. అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్యను సైతం తగ్గించేందుకు జగన్‌ సర్కారు విశ్వప్రయత్నాలు చేసింది.

జగన్‌రెడ్డి... ఓ కోతలరాయుడు

  • పొరుగు సేవల ఉద్యోగులకు రూ.15 వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ వారికి జగన్‌ మార్కు షాక్‌ రుచి చూపించారు. అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాలో వివిధ శాఖల్లో 27 వేల మంది పొరుగుసేవల ఉద్యోగులుండగా, వీరి మేలు కోసమే ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ను తీసుకు వచ్చినట్లు గొప్పలు చెప్పిన జగన్‌ వీరిలో 18 వేల మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు.
  • ఆప్కాస్‌ పరిధిలో ఉన్నవారి వేతనాలను సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానించడంతో వారి వివరాలన్నీ రాబడుతూ పథకాలకు కోత వేశారు.
  • మిగిలిన వారికి ప్రతి నెలా విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు లోపే ఉండాలని షరతులు పెట్టారు. నాలుగు చక్రాల కారు ఉండరాదని, మగాణి భూమి మూడెకరాలు, మెట్ట 10 ఎకరాలకు పైగా ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తప్పించారు. పట్టణాల్లో 750 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉన్నా లబ్ధి ఇవ్వకుండా మొండిచేయి చూపారు.

సమగ్ర వివరాల్లేవని కుంటిసాకులు

విద్యార్థి, తల్లి ఆధార్‌ పత్రంలో తప్పులున్నాయని, బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక లావాదేవీలు జరగలేదని, బియ్యం కార్డులో విద్యార్థి పేరు లేదని కుంటిసాకులతో అర్హులకు కోత పెట్టారు. మరికొందరికీ నగదు జమ చేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు వద్దకు వెళ్లి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చిందా లేదా అని అని పరిశీలిస్తే డబ్బులు రాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు ఈ విషయంపై తల్లిదండ్రులు పదేపదే ప్రశ్నిస్తున్నా త్వరలో వస్తుందని ఊరించే మాటలతో కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి ఆధార్‌ సంఖ్య అనుసంధానం కావడంతో ధనవంతులుగా చూపి పక్కన పెట్టేశారు. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం లేదు. ఒక ఇంటి విద్యుత్తు మీటరు కనెక్షన్‌కు మరొకరి ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం కావడంతో చాలామందిని అనర్హుల జాబితాలో చేర్చారు.

75 శాతం హాజరుతోనూ ముడిపెట్టి...

అమ్మఒడి పథకంలో లబ్ధి పొందాలంటే బడికి వచ్చే విద్యార్థి ఏటా 75 శాతం కచ్చితంగా హాజరుకావాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులందాయి. ఇంతకంటే తక్కువ రోజులు పాఠశాలకు వస్తే పథకం వర్తించదని తేల్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు కంగుతిన్నారు. పిల్లల అమ్మనాన్నల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మేమింతే అన్నట్లు సీఎం జగన్‌ మొండిగా ముందుకెళ్లారు.

ఆరెంచల విధానంతో  వడపోత?

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఆరెంచల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల అర్హతపై సందేహం ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు, సిబ్బంది ద్వారా క్షేత్ర స్థాయిలో పునః పరిశీలన చేయించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అర్హత ఉందని ధ్రువీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా చాలామందికి అమ్మఒడి భాగ్యం కలగలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లబ్దిదారులకు మోక్షం లభించలేదు.  


విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ ఏదీ?

తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడిలో ఆర్థిక సాయం అందజేస్తున్నాం. నగదు వద్దని అనుకున్న వారికి ల్యాప్‌టాప్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం చొరవ తీసుకొని పెద్ద కంపెనీలతో మాట్లాడుతోందని 2021, జనవరి 11న సీఎం జగన్‌ ప్రకటించారు. మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.27 వేలు పలికే ల్యాప్‌టాప్‌ రూ.18,500కే ఇస్తామని గొప్పగా ప్రకటించి అనంతరం అదనపు భారమవుతుందని చేతులెత్తేశారు.


మాట తప్పారు... మడమ తిప్పారు

వైకాపా ప్రభుత్వం నిబంధనలను తెరపైకి తీసుకురావడంతో రెండో సంవత్సరం నుంచి క్రమంగా తగ్గించుకుంటూ నాలుగో ఏడాదిలో 11,315 మందికి లబ్దిదారులు తగ్గిపోయారు. అదే తొలి ఏడాది పొల్చి చూస్తే చివరి సంవత్సంలో రూ.36.21 కోట్లు మేర ప్రభుత్వం మిగుల్చుకుంది. ఇక సీఎం ఆర్భాటంగా బటన్‌ నొక్కిన తర్వాత వెంటనే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. కొన్ని నెలల తర్వాత అది కూడా రెండు, మూడు విడతలుగా జమ చేస్తున్నారు. మొదటి రెండేళ్లు జనవరిలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 2021-22లో 75 శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్‌లో నగదు జమచేసింది. 2022-23లోనూ అదే లెక్కన గత జూన్‌లో జమ చేశారు. ఈ ఏడాది జూన్‌లో మళ్లీ సాయం ఇచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తుంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో నాలుగు పర్యాయాలు మాత్రమే ఇచ్చినట్లవుతుంది. ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చదివే పేద పిల్లలపై మీ శ్రద్ధ ఇదేనా జగన్‌ మామయ్యా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని