logo

పశు మాంసం కోల్డ్‌ స్టోరేజీలపై దాడులు

అనుమతి లేకుండా కొనసాగుతున్న గొడ్డుమాంసం కోల్డ్‌ స్టోరేజీలపై జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలాపూర్‌ పోలీసుల సహకారంతో అల్‌

Published : 19 May 2022 02:13 IST

జల్‌పల్లిలో అనుమతిలేని ఐదింటి సీజ్‌

పని చేస్తున్న కార్మికులు

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: అనుమతి లేకుండా కొనసాగుతున్న గొడ్డుమాంసం కోల్డ్‌ స్టోరేజీలపై జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలాపూర్‌ పోలీసుల సహకారంతో అల్‌ జాబ్రీ కాలనీ, సుల్తాన్‌పూర్‌ పరిసర ప్రాంతాల్లోని స్టోరేజీలను తనిఖీ చేయగా నిల్వవున్న, పాడైన మాంసం, ఎముకలు, వ్యర్థాలు, తదితర కుళ్లిపోయిన పదార్థాలు వెలుగు చూశాయి. వీటిని ప్రధానంగా చైనా, బంగ్లాదేశ్‌, యూఏఈలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. విదేశాలకు పంపించేందుకు అనుమతి లేకున్నా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు వీలు కల్పిస్తారని స్టోరేజ్‌ నిర్వాహకులు కమిషనర్‌కు చెప్పడం గమనార్హం.  

ముందస్తు తేదీలతో..
విదేశాలకు మాంసం ఎగుమతి చేసే పెట్టెలపై తయారీ తేదీ జూన్‌గా ముద్రించారని, తద్వారా కుళ్లిన మాంసాన్ని తాజాగా ఉందన్నట్లు చిత్రీకరిస్తున్నారని కమిషనర్‌ వెల్లడించారు. పాడైన మాంసాన్ని రసాయనాలతో శుభ్రం చేసి దానిపై ఉన్న కొవ్వును వేరుచేసి దానిని నూనెగా మార్చి స్థానికంగా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

ఓ కేంద్రాన్ని సీజ్‌ చేసిన అధికారులు

నంబరు ప్లేట్‌పై ‘ఎమ్మెల్సీ’
ఓ కోల్డు స్టోరేజీ నిర్వాహకుడి కారు నంబరు ప్లేటుపై ఎమ్మెల్సీ అని రాసి ఉందన్నారు. కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అండతోనే వ్యాపారులు దందా కొనసాగిస్తున్నట్లు వెల్లడవుతోందని కమిషనర్‌ తెలిపారు. ఇక్కడ వెట్టిచాకిరీ చేస్తున్న బాల కార్మికుల వివరాలను రేపటిలోగా వెలికి తీస్తామన్నారు. బాలాపూర్‌ ఠాణాలో కేసును నమోదు చేశామని తెలిపారు.

దాడులు ఆపాలని పదేపదే ఫోన్లు: కమిషనర్‌
అనుమతి లేకుండా కొనసాగుతున్న పది పరిశ్రమలపై దాడులు చేసి ఐదింటిని సీజ్‌ చేశామని కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. వీటిల్లో అధికంగా గోవులను వధిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 20 స్టోరేజీలు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. వీటివల్ల పరిసరాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందన్నారు. రెవెన్యూ, పీసీబీ అధికారులు, బాలాపూర్‌ పోలీసులు పూర్తిస్థాయిలో అండగా నిలవడంతోనే ఈ దాడులు చేపట్టగలిగామన్నారు. లేకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారేదన్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రజాప్రతినిధుల నుంచి దాడులు ఆపాలని తనకు పదేపదే ఫోన్లు వచ్చాయన్నారు. అయినా తనిఖీలు కొనసాగించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని