icon icon icon
icon icon icon

Chandrababu: రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.. సంకల్పంతో ముందుకెళ్లండి: చంద్రబాబు

రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

Published : 21 Apr 2024 19:02 IST

అమరావతి: రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్‌లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఫామ్‌లు తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తేల్చి చెప్పారు. 3 పార్టీల మధ్య సమన్వయం ఉంటూనే,  ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు. వైకాపాలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చిన మంచి వాళ్లను మాత్రమే తీసుకుని సీట్లు ఇచ్చానని స్పష్టం చేశారు.

పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైను ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే ఉందని గుర్తు చేసిన చంద్రబాబు.. ఈ సమయం ఎంతో కీలకమన్నారు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడంలో జగన్‌ నేర్పరి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధరిస్తే.. దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు. జగన్‌ బస్సు యాత్రలో వాళ్లే కరెంట్‌ తీసుకుని, చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకొచ్చి నినాదాలు చేశారని విమర్శించారు. రాయి దాడి ఘటనలో బొండా ఉమ ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

పింఛన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేసి, వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో ఆగిపోయాయని విష ప్రచారం చేశారని ఆరోపించారు. అమరావతి, పోలవరాన్ని జగన్‌ విధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేడర్‌తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలని సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img