icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన నేత బీవీ వెంకటరాముడిని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర మీడియా సమన్వయకర్తగా నియమించారు.

Updated : 26 Apr 2024 06:31 IST

తెదేపా రాష్ట్ర మీడియా సమన్వయకర్తగా వెంకటరాముడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన నేత బీవీ వెంకటరాముడిని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర మీడియా సమన్వయకర్తగా నియమించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు వెంకటరాముడు మీడియా సమన్వయకర్తగా వ్యవహరించారు.


మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచారం

ఈనాడు, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మే 3, 4 తేదీల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో, రోడ్‌ షోలో పాల్గొంటారు. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం 6.30కి విజయవాడలో రోడ్‌ షోలో పాల్గొంటారు. నాలుగో తేదీ మధ్యాహ్నం 3.45కు రాజమహేంద్రవరం, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో జరిగే సభల్లో మోదీ పాల్గొంటారు.


కోడ్‌ ఉల్లంఘించిన చెవిరెడ్డిపై చర్యలు తీసుకోండి
ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల్ని బెదిరించిన వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఎన్నికల అదనపు అధికారికి తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఏఎస్‌ రామకృష్ణ, అశోక్‌బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనేరు సురేశ్‌లు గురువారం ఫిర్యాదు చేశారు.


తెదేపాకు ముస్లిం సంఘాల మద్దతు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో తెదేపాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పలు ముస్లిం సంఘాలు ప్రకటించాయి. విజయవాడలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ అధ్యక్షతన వివిధ సంఘాల ప్రతినిధులు గురువారం సమావేశం నిర్వహించారు. తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రమంతా పర్యటిస్తామని రాష్ట్ర ఇమానే మజ్లీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ ఫరీద్‌ తెలిపారు. గతంలో ముస్లింలకు తెదేపా ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, మరోసారి అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే పథకాలను వివరిస్తామన్నారు. ఏపీ ముస్లిం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ జాఫర్‌ మాట్లాడుతూ ముస్లింలకు ప్రత్యేక పథకాలు అమలుచేసి గుర్తింపునిచ్చింది తెదేపానే అని, ఆ పార్టీకి అండగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఏపీ ముస్లిం మైనారిటీ యువజన కమిటీ అధ్యక్షుడు షేక్‌ ముజీబ్‌ మాట్లాడుతూ ముస్లింలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడే నేత చంద్రబాబు అని, తెదేపా అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు.


నెల్లూరు టౌన్‌ డీఎస్పీని బదిలీ చేయండి
సీఈఓకు వర్ల రామయ్య ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బందిపెడుతున్న నెల్లూరు టౌన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఆయన సీఎం జగన్‌ ఓఎస్డీ నీలకంఠరెడ్డికి దగ్గర బంధువని, ఇలాంటి పోలీసు అధికారి ఆధ్వర్యంలో పారదర్శక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాకు గురువారం ఫిర్యాదు చేశారు.


పింఛన్ల పంపిణీపై ఈసీకి లేఖ రాశాం: మంత్రి బొత్స

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: వచ్చే నెల ఒకటో తేదీకల్లా అందరికీ పింఛన్లు పంపిణీ అయ్యేలా చూడాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పీకే పాలవలసలో గురువారం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.


మెగా డీఎస్సీ అని మోసం: తెదేపా నేత వల్లూరి కిరణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామంటూ హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదని తెదేపా నేత వల్లూరి కిరణ్‌ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత రేటు.. జాతీయ స్థాయి కంటే 11 శాతం అధికంగా ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img