icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌పై అదే నిర్లక్ష్యం

నాలుగు రోజులుగా పోస్టల్‌ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

Published : 07 May 2024 08:13 IST

ఎన్నికల సంఘం తీరుపై విమర్శల వెల్లువ

ఈనాడు, అమరావతి: నాలుగు రోజులుగా పోస్టల్‌ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పోస్టల్‌ బ్యాలట్‌ కోసం ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతు కావడం, కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించకపోవడం, ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభించడం నిత్యకృత్యంగా మారాయి. పోస్టల్‌ బ్యాలట్‌ ఉన్న వారు ఏ కేంద్రంలో ఓటు వేయాలో ముందుగా వారి సెల్‌ఫోన్లకు సమాచారం పంపిస్తే కొంతవరకు ఆందోళన తగ్గుతుంది. కానీ, ఎన్నికల అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. కర్నూలుకు చెందిన కొందరు అధికారులు శిక్షణ కోసం నంద్యాల జిల్లాకు వెళ్లారు. వీరి బ్యాలట్లను నంద్యాలకు పంపించగా.. వారు సకాలంలో ఇవ్వలేదు. దీంతో అధికారులు కర్నూలుకు రాగా.. ఇక్కడ బ్యాలట్లు లేవంటూ తిప్పి పంపారు. ఇలా చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. పోస్టల్‌ బ్యాలట్‌పై సంతకం చేస్తున్న కొందరు గెజిటెడ్‌ అధికారులు స్టాంప్‌ వేయడం లేదు. కొన్ని చోట్ల కవర్లు సక్రమంగా సీల్‌ చేయడం లేదు. ఇలాంటి ఓట్లు చెల్లుబాటు అవుతాయా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రంలో ముగ్గురు పోలీసులకు ఆర్‌ఓ సీల్‌ వేయకుండా బ్యాలట్‌ పేపర్‌ ఇచ్చారు. ఓటు వేసిన తర్వాత తప్పిదాన్ని గుర్తించారు.

జాబితాలో కనిపించని పేర్లు..

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీఓ, ఏపీవోలకు పట్టణంలోని వై.పి.పి.ఎం. పాఠశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ 590 మంది పోలింగ్‌ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటరు జాబితా పంపకపోవడంతో వారిలో 70 మంది ఓటు వేయలేకపోయారు. నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్‌, శ్రీశైలం నియోజకవర్గాలకు చెందిన 1,250 మందికిపైగా ఉద్యోగులకు పీఓలు, ఏపీఓలుగా డ్యూటీలు వేశారు. వీరంతా పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకున్నా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి.

ఉద్యోగులకు తాయిలాలు..

  • అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా నాయకులు కొందరు ఉద్యోగులకు రూ.3 వేలు పంపిణీ చేశారు.
  • పల్నాడు జిల్లా మాచర్లలో ఒక్కో ఉద్యోగికి వైకాపా నేతలు రూ.5 వేలు ఇచ్చారు.
  • పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ బంధువుతో పాటు, వైకాపా నాయకులు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వైకాపాకు ఓటేయాలని కోరుతూ రూ.2500 ఉన్న కవర్‌ను వారి చేతుల్లో పెట్టారు.

నరసరావుపేటలో వైకాపా నేతల దౌర్జన్యం..

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైకాపా నేతల అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. స్థానిక పోలింగ్‌ కేంద్రంలోకి తెదేపా అభ్యర్థి అరవిందబాబును ఎలా అనుమతించారంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో గొడవకు దిగారు. ఎవరినీ లోపలకు పంపలేదని అధికారులు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా తన అనుచరులతో కలిసి అక్కడే ఉన్న తెదేపా నేతలపై దాడికి పాల్పడ్డారు. కంకులగుంటకు చెందిన తెదేపా నాయకుడి కారు ధ్వంసం చేసి డ్రైవర్‌ను చితకబాదారు.


బ్యాలట్‌ పేపర్లకు బదులు ఈవీఎం మోడల్‌ బ్యాలట్ల అందజేత

పోలింగ్‌ ముగిశాక పొరపాటు గుర్తింపు
1219 మందితో తిరిగి ఓట్లు వేయించాలని ఈసీ ఆదేశాలు

చిలకలూరిపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలట్లకు బదులు ఈవీఎంలో పెట్టే మోడల్‌ బ్యాలట్లను అందజేయగా ఉద్యోగులు వాటి మీదే ఓట్లు వేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1219 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారికి బ్యాలట్‌ పేపర్లకు బదులు ఈవీఎంలో పెట్టే మోడల్‌ బ్యాలట్‌ పేపర్లను ఇచ్చారు. వారు దాని మీదే ఓటు వేసి పెట్టెలో వేశారు. జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదిక పంపించారు. స్పందించిన సీఈఓ ఆ ఓట్లను సీల్‌ వేసి భద్రపరచాలని ఆదేశించారు. 1219 మంది ఓటర్లతో 8, 9 తేదీల్లో మళ్లీ ఓట్లు వేయించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img