icon icon icon
icon icon icon

కొడాలికి ‘కోడ్‌’ వర్తించదా?.. రంగా విగ్రహానికి ముసుగు తొలగించి మరీ దండలు

కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్‌ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు.

Updated : 07 May 2024 08:44 IST

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్‌ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు. తాజాగా గుడివాడ మండలం మోటూరులో ఆదివారం ప్రచారానికి వెళ్లిన నాని.. తన అనుచరులతో కలిసి వంగవీటి మోహనరంగా విగ్రహానికి ముసుగు తొలగించి మరీ పూలదండలు వేశారు. అయినా ఎన్నికల అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆయన ఇలా కోడ్‌ ఉల్లంఘిస్తూ విగ్రహానికి పూలదండలు వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇక్కడి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన వైకాపా ఆత్మీయ సమావేశం కూడా నిబంధనలు విస్మరించి రాత్రి 10.32 వరకు కొనసాగించారని తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆఫీసర్స్‌ క్లబ్‌లో పార్టీ సమావేశాలు..

గుడివాడలోని ఆఫీసర్స్‌ క్లబ్‌కు ఆర్డీఓ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆ అధికారి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగానూ కొనసాగుతున్నారు. ఇప్పటికే కొడాలి నానికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేలా ఆర్డీఓ నిర్ణయాలు ఉంటున్నాయని తెదేపా నాయకులు ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆఫీసర్స్‌ క్లబ్‌లోనే వైకాపా నాయకులు పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఇక్కడ సమావేశం పెట్టారు. కోడ్‌ అమల్లో ఉండగా.. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రెసిడెంట్‌గా ఉన్న క్లబ్‌లో సమావేశాలకు ఎలా అనుమతిస్తారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img