icon icon icon
icon icon icon

Chandrababu: పెంచిన మద్యం ధరల్లో జగన్‌, పెద్దిరెడ్డి వాటా ఎంత?: చంద్రబాబు

పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

Published : 07 May 2024 17:49 IST

పుంగనూరు: పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరించారు. పుంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు.

‘‘నల్లారి కుటుంబానికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డికి, పాపాల పెద్దిరెడ్డికి అసలు పోలిక ఉందా? అతన్ని రాజకీయంగా భూ స్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు. కిరణ్ కుమార్‌రెడ్డి ఎంపీ అయితే.. పెద్దిరెడ్డికి నిద్ర పట్టదు. అతని ఆధిపత్యానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి చెక్‌ పెడతారు. మామిడి కాయల కొనుగోలులో కూడా కమీషన్లు కొట్టేశారు. ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే. ఆ కుటుంబమంతా అవినీతి చేసి రూ.30వేల కోట్లు కొట్టేశారు. అక్రమ కేసులు పెట్టించి ప్రజలను వేధించారు. అంగళ్లులో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి.. నాతో పాటు 400 మంది కార్యకర్తలపై  అక్రమ కేసులు పెట్టారు. మా కార్యకర్తలు ఎంత బాధపడ్డారో దానికి తగిన మూల్యం చెల్లిస్తాం.

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు. మద్యం ధరలు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. చివరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్‌. 2019లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి వచ్చింది. పెంచిన మద్యం ధరల్లో జగన్‌, పెద్దిరెడ్డి వాటా ఎంత? అవినీతి సొమ్మును కక్కించి జూన్‌ 4 తర్వాత పేదలకు పంచుతాం’’ చంద్రబాబు ప్రకటించారు.

పెద్దిరెడ్డిని ఇంటికి పంపాల్సిందే: కిరణ్‌ కుమార్‌రెడ్డి

మాజీ సీఎం, రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..పుంగనూరులో పెద్దిరెడ్డిని ఇంటికి పంపాల్సిందేనని పిలుపునిచ్చారు. ‘‘డీసీసీ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి. చంద్రబాబు రోడ్లు మంజూరు చేస్తే.. పెద్దిరెడ్డి కమీషన్లు తీసుకున్నారు. ప్రజల నుంచి కూడా కమీషన్లు తీసుకునే వ్యక్తికి ఓటు వేస్తారా?  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరం. ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని మోసపోవద్దు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఉంటాయి. ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img