icon icon icon
icon icon icon

కత్తికట్టిన అధికార పక్షం కట్టు తప్పిన రాష్ట్రం..

తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు.

Published : 07 May 2024 06:03 IST

తెదేపా తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తాం
మా అడ్డాకి వచ్చి ప్రచారం చేయటానికి ఎంత ధైర్యం రా?
ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు బెదిరింపులు
వైకాపా సభలకు రాలేదని ప్రజల ఆస్తుల ధ్వంసం
సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఊళ్లో ఉండనివ్వబోమని హెచ్చరికలు
పోలింగ్‌ తేదీ దగ్గరవుతున్న కొద్దీ హింసాత్మక చర్యలు ఉద్ధృతం
ఈనాడు, అమరావతి

తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. వాళ్ల ప్రచార రథాలను తగలబెట్టేస్తున్నారు. ‘మా అడ్డాకు వచ్చి ప్రచారం చేయటానికి మీకెంత ధైర్యం రా?’ అంటూ పేట్రేగిపోతున్నారు. ఏకంగా ఇళ్లలోకి చొరబడి మరీ కర్రలు, రాడ్లతో విచక్షణ రహితంగా కొడుతున్నారు. పోలీసుస్టేషన్ల వద్దా.. ప్రతిపక్ష పార్టీల శ్రేణుల పైకి దూసుకెళ్తున్నారు. ఎన్నికల వేళ వైకాపా దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, దుశ్చర్యలు, బెదిరింపులు, ధ్వంస రచనలతో రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేస్తోంది. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ వాటిని మరింతగా పెంచుతోంది. హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాల్సిన పోలీసులు అధికార పార్టీ అరాచకాలను అణచివేయకుండా చేష్టలుడిగి చూస్తున్నారు. వైకాపాతో అంటకాగుతూ, కొమ్ముకాస్తున్నారనే ఫిర్యాదుల పైనే ఎన్నికల సంఘం పలు జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అయినా సరే క్షేత్రస్థాయిలో వైకాపా దమనకాండ మరింతగా కొనసాగుతూనే ఉంది. అనేకచోట్ల పోలీసులే వాటికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు.

అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడులపై తప్పనిసరి పరిస్థితుల్లో తేలికపాటి సెక్షన్ల కింద మొక్కుబడిగా కేసులు కట్టి మమ అనిపించేయడం మినహా దర్యాప్తు చేయట్లేదు. ఒక్కరంటే ఒక్కర్నీ అరెస్టు చేయట్లేదు. బాధితుల పైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారు. తీవ్ర నేర ఘటనల్లోనూ బైండోవర్‌లతో సరిపెట్టేస్తున్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో అరాచక సామ్రాజ్యంగా మారిన పుంగనూరు, మరో చంబల్‌లోయలా తయారైన మాచర్ల తదితర నియోజకవర్గాల్లో అయితే అత్యంత దారుణ పరిస్థితులున్నాయి. అక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అధికార వైకాపా తరఫున పోలీసులే నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఉంది. ఎక్కడ హింసాత్మక ఘటన జరిగినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తామంటూ పదేపదే చెబుతున్న ఎన్నికల సంఘం.. ఇన్ని దుశ్చర్యలు చోటుచేసుకుంటున్నా సరే బాధ్యుల్ని ఎందుకు ఉపేక్షిస్తోంది? ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొంతమంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని తీవ్రమైన హెచ్చరిక పంపించకపోవడం వల్లే ప్రతిపక్షాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్‌ దౌర్జన్యకాండ..

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరులు చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వారి అనుచరుల దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైకాపాను వీడి తెదేపాలో చేరిన వారి ఇళ్ల వద్దకు అర్ధరాత్రి మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళ్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మరీ బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో చేరిన వారిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోతున్నారు. అయినా సరే పోలీసులు వారివైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన వైకాపా నాయకుడు తలారి పుల్లప్ప అనుచరులతో కలిసి ఇటీవల తెదేపాలో చేరారు. దీంతో అర్ధరాత్రి వేళ ఆ ఊరు వెళ్లిన రాజశేఖర్‌రెడ్డి.. పుల్లప్పను పిలిపించి ‘వెంటనే వైకాపా కండువా వేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడతావు’ అని హెచ్చరించారు. తోపుదుర్తి గ్రామానికి చెందిన దళిత నాయకుడు వన్నూరప్ప, బోయ సామాజికవర్గ నాయకుడు లింగమయ్యలు ఇటీవల తెదేపాకు మద్దతు ప్రకటించినందుకు అర్ధరాత్రి వేళ వారి ఇళ్లకు వెళ్లి బెదిరించి దాడికి తెగబడ్డారు. తెదేపాలో చేరిన రామగిరి మండలం మాదాపురానికి చెందని దళిత నాయకుడు, ఎంపీటీసీ సంపత్‌ను అపహరించి.. అడ్డొచ్చిన వారిపై దాడి చేశారు. ఈ దాడికి ప్రకాశ్‌రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నాయకత్వం వహించారు. ఎమ్మెల్యే సోదరులు ఇద్దరూ ఇంత దౌర్జన్యకాండకు పాల్పడుతుంటే వారిని పోలీసులు ఎందుకు ఎందుకు నియంత్రించట్లేదు?

మాచర్లలో వరుసగా దాడులు, దాష్టీకాలు

మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలపై దాడులు, దాష్టీకాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఏకంగా తెదేపా కార్యాలయాలను తగలబెట్టేస్తున్నారు. తమ ప్రాంతంలో ప్రతిపక్షాలు ప్రచారం చేయటానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకే విఘాతం కలిగిస్తున్నారు. ఇతర పార్టీల ప్రచార రథాలను ధ్వంసం చేస్తున్నారు. పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాచర్లలో ఘర్షణలన్నింటికీ అసలు కుట్రదారైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సైకిల్‌కు ఓటేస్తే ఊళ్లో ఉండనివ్వను...

‘సైకిల్‌ గుర్తుకు ఓటేసిన వారెవ్వర్నీ ఊళ్లో ఉండనివ్వను’ అంటూ ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఓటర్లను బెదిరించారు. మూలపల్లె, శకునాలపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరీ హెచ్చరించారు. మరి అలాంటి వారిపై ఎందుకు ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు?


ఊరూరా దాడులే.. దాడులు

  • పార్వతీపురం వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావు వాలంటీర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం తెలిసి దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రపై దౌర్జన్యం చేశారు. ‘ఇక్కడ నీకు తంతే దిక్కెవర్రా?’ అని బెదిరించారు.
  • పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద తెదేపా ప్రచార వాహనానికి వైకాపా నాయకులు నిప్పుపెట్టారు. డ్రైవర్‌ సీట్లో ఉండగానే వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించటంతో ఆయన తీవ్రంగా గాయాలపాలయ్యారు. రాయదుర్గం ఐటీడీపీ ప్రతినిధి కృష్ణానాయక్‌ను ద్విచక్రవాహనంపై నుంచి కిందకు లాగేసి పిడిగుద్దులు కురిపించి దాడి చేశారు.
  • తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు నామినేషన్‌ వేయడానికి వచ్చిన చంద్రగిరి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తెదేపా అభ్యర్థి పులవర్తి నాని వాహనాలపై దాడికి యత్నించారు.
  • అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా తెదేపా కార్యకర్త ఇంటిని తగలబెట్టేశారు. ఆస్తి నష్టం కలిగించారు.
  • పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ప్రశ్నించినందుకు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు సలాంపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి.
  • పీలేరు నియోజకవర్గం పీలేరు-కలికిరి మార్గంలో వేపులబైలు వద్ద బీవైసీపీ ప్రచార వాహనలకు వైకాపా శ్రేణులు నిప్పు పెట్టారు.  
  • రాయచోటి నియోజకవర్గం కల్పనాయునిచెరువులో తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించగా.. తెదేపా ప్రచార రథాన్ని వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా కార్యకర్త దిలీప్‌కుమార్‌ యాదవ్‌ను కర్రలతో తీవ్రంగా కొట్టారు.

తెదేపా కార్యక్రమాలకు హాజరైతే వేధింపులు

  • నెల్లూరు జిల్లా పొదలకూరులో చంద్రబాబు సభకు హాజరైనందుకు.. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపాలేనికి చెందిన పామంజి శ్రీరాములపై వైకాపా శ్రేణులు హత్యాయత్నానికి తెగబడ్డాయి.
  • వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్‌ సందర్భంగా ర్యాలీకి హాజరైనందుకు ఈపూరు మండలం ఇనుమెళ్లలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి.
  • మాచర్ల నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మాగంటి అంకారావుపై వైకాపా నాయకులు దాడి చేశారు. తెదేపా పోలింగ్‌ ఏజెంటుగా కూర్చొంటే నరికేస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బైండోవర్‌తో సరిపెట్టేశారు.
  • వైకాపా అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీకి హాజరుకాలేదని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలం నల్లమడుగుల ఎస్టీ కాలనీ వాసులకు ఇళ్లకు నీటి సరఫరా నిలిపేశారు.
  • మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం ఉప్పలపాడు ఎస్టీ కాలనీలో తెదేపాకు మద్దతిస్తున్నారని తాగునీటి సరఫరా ఆపేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img