icon icon icon
icon icon icon

ఓటర్లకు డబ్బు పంచిన కానిస్టేబుల్‌

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ కానిస్టేబుల్‌ను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో వైకాపా మూకలు గొడవకు దిగి, రాళ్ల దాడికి తెగబడ్డాయి.

Updated : 07 May 2024 08:14 IST

ప్రశ్నించిన తెదేపా శ్రేణులతో వైకాపా మూకల ఘర్షణ
కళ్యాణదుర్గంలోని పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రం వద్ద ఘటన

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ కానిస్టేబుల్‌ను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో వైకాపా మూకలు గొడవకు దిగి, రాళ్ల దాడికి తెగబడ్డాయి. పట్టణంలో సోమవారం రెండు కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయ సమీపంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు వేసేందుకు వస్తున్న వారిని అక్కడే తిష్ఠ వేసిన బొమ్మనహాళ్‌ పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ శివ ప్రలోభాలకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్‌ అక్కడికి చేరుకున్నారు. అతని వద్ద ఉన్న పోస్టల్‌ బ్యాలట్‌ జాబితా తీసుకుని, ఇలా చేయడం తప్పు.. వెళ్లిపోవాలని సూచించారు. నేను పోలీస్‌ని.. నువ్వెవరు నాకు చెప్పేందుకంటూ ఆ కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తలను ఉసిగొల్పడంతో వారు యశ్వంత్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో నారాయణపురం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ఓంప్రకాశ్‌ రాళ్లు విసిరాడు. ఓ రాయి యశ్వంత్‌ వాహనానికి, మరొకటి కానిస్టేబుల్‌ నరసింహకు తగలడంతో ఆయన గాయపడ్డారు. పోలీసులు ఓంప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వైకాపా నాయకులు అతడిని తప్పించి కారులో తీసుకెళ్తుండగా, తెదేపా నాయకులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు ఓంప్రకాశ్‌ను మళ్లీ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img