icon icon icon
icon icon icon

పవన్‌కల్యాణ్‌ను ‘గెలిపించండి’

నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు.

Published : 08 May 2024 06:59 IST

అలాంటి నాయకుడే ప్రజలకు అవసరం
గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి
మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం చిరంజీవి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఆ సందేశం వైరల్‌ అవుతోంది. ‘‘కొణిదెల పవన్‌కల్యాణ్‌ అమ్మ కడుపులో ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనుకునే వారిలో ముందుంటారు. తన గురించి కంటే జనం గురించే ఎక్కువ ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్‌ బాబుది. ఎవరైనా.. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ, కల్యాణ్‌ తన సంపాదనతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచారు. జవాన్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. మత్స్యకారులకు, మరెందరికో సాయం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు కదా.. ప్రజలకు కావాల్సిందనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్‌కల్యాణ్‌ సినీ రంగంలోకి బలవంతంగా వచ్చారు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చారు. ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న తల్లికి.. పవన్‌ అన్నయ్యగా ఒకే మాట చెప్పా. ఎంతో మంది తల్లుల కోసం.. వారి బిడ్డల భవిష్యత్తు కోసం.. నీ కొడుకు గొప్ప యుద్ధం చేస్తున్నారని, మన బాధ కంటే అది ఎంతో గొప్పదని చెప్పా. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం పవన్‌ జన సైనికుడయ్యారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్‌. ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతని గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలరో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు అండగా నిలబడతారు. మీ కోసం యుద్ధం చేస్తారు. పిఠాపురం వాసులకు మీ చిరంజీవి విన్నపం ఒకటే. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్‌కల్యాణ్‌ను గెలిపించండి. జై హింద్‌.’’ అని చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img